బాక్సాఫీస్ వద్ద 'రంగస్థలం, భరత్ అనే నేను'లు కాస్త ఊపు తగ్గించాయి. 'మహానటి' రాకతో ఇప్పుడు ఆ చిత్రంపై, పూరి 'మెహబూబా'లపై ప్రేక్షకుల దృష్టి ఉంది. ఇక కొరటాల శివ 'శ్రీమంతుడు' తీసినప్పుడు కూడా ఓ రచయిత ఈ కథ తనదేనని హడావుడి చేశాడు. అది ఆ చిత్రం పబ్లిసిటీకి ఉపయోగపడిందో లేదో గానీ తాజాగా 'భరత్ అనే నేను' విషయంలో విడుదలైన ఇన్నిరోజులకు ఓ వివాదం చెలరేగింది. ఇప్పటికీ సినిమా నుంచి ఎడిట్ చేసిన దృశ్యాలను సోషల్ మీడియాలో పెడుతూ, కలెక్షన్లు పడిపోకుండా ఉండే చర్యలను దర్శకనిర్మాతలు తీసుకుంటూ ఉంటే, తాజాగా ఈ చిత్రంలో వాడిన నవోదయం పార్టీ తమదేనని, తమకు పార్టీ గుర్తింపు కూడా ఈసీ నుంచి వచ్చిందని, తమ అనుమతి లేకుండా నవోదయం పార్టీని సినిమా మేకర్స్ వాడుకున్నారని ఓ పార్టీ ఆందోళనకు సిద్దమవుతోంది.
అయినా ఈ సినిమా విడుదలై ఇంత కాలం తర్వాత ఇప్పుడు ఈ విషయాన్ని హైలైట్ చేయడం చూస్తుంటే మేకర్స్‌కి కూడా దీనిలో ప్రమేయం ఉందా? అనే అనుమానం రాకమానదు. ఇక ఈ చిత్రంలో నవోదయం పార్టీ అధ్యక్షుడు అవినీతి చేసినట్లు చూపించారని, కాపీ రైట్ చట్టానికి వ్యతిరేకంగా ఈ మేకర్స్ వ్యవహరించారని ఈ పార్టీకి చెందిన వారు ఓ ప్రెస్‌మీట్ పెట్టారు. తమ పార్టీకి ఈ చిత్ర యూనిట్ భేషరత్తుగా క్షమాపణలు చెప్పాలని, చట్టపరంగా పార్టీకి నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
2014 ఎన్నికల్లో తమ పార్టీ చీరాల నుంచి కూడా పోటీ చేసిందని తెలిపిన వారు లాయర్ నోటీసులు పంపామని, చట్టప్రకారం ఈ మేకర్స్‌పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక దేశంలో చిన్నచితకా ఎన్నో పార్టీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వీటి అడ్రస్ కూడా ఎవరికీ తెలియదు. అయినా సినిమా ఊపు తగ్గాక ఇలాంటి వివాదాలు ఏమిటో వేచిచూడాల్సివుంది!