ప్రస్తుతం ఉన్న రచయితలో సాయిమాధవ్ బుర్రాకి ఒక స్టైల్ ఉంది. 'కృష్ణం వందే జగద్గురుం, కంచె, మళ్లీమళ్లీ ఇదిరాని రోజు, గౌతమీపుత్ర శాతకర్ణి, ఖైదీనెంబర్ 150, గోపాలగోపాల' వంటి చిత్రాలకు ఆయన పనిచేశాడు. తన పాండిత్యాన్ని చూపించాలనే తాపత్రయం లేకుండా కథకు, సన్నివేశానికి, పాత్ర తీరుతెన్నులని బట్టి ఆయన మాటలు రాస్తుంటాడు. ఇక 'మహానటి'తో ఆయన కెరీర్‌లో మరో ఆణిముత్యం నిలిచింది. ఇక తాజాగా సాయిమాధవ్ బుర్రా మాట్లాడుతూ, నేను ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలమే అయింది. కానీ ఎప్పుడు తిరిగి వెళ్లిపోవాలని భావించలేదు. ఎందుకంటే నాకు రాయడం తప్ప మరోది రాదు. కాస్త నటన వచ్చు అంతే. ఇక అవకాశాలు అందిపుచ్చుకోవడం నాకు చేతకాదని నన్ను నేను విమర్శించుకున్నానే గానీ ఇండస్ట్రీని ఎప్పుడు తిట్టుకోలేదు. ఎందువల్లో తెలియదు గానీ నాకు అవకాశాలు అడగడం రాదు.
ఇక 'మహానటి' చిత్రం విషయానికి వస్తే, నాకు కష్టాలు వచ్చినప్పుడు కన్నీళ్లు రావు. మంచి సినిమా, మంచి సీనో చూస్తున్నప్పుడు కన్నీళ్లు వస్తాయి. మహానటి చిత్రం కోసం పలువురి పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసి వారి స్పందనను బట్టి డైలాగ్స్ రాయాల్సి వచ్చేది. ముఖ్యంగా సావిత్రిలోకి వెళ్లి ఆమె ఎలా స్పందిస్తుంది అని ఆలోచించి మాటలు రాసే సమయంలో కొన్నిసార్లు నాకు తెలియకుండానే కన్నీళ్లు వచ్చి నేను రాసుకున్న కాగితాలు తడిసిపోయేవి..అని చెప్పుకొచ్చాడు.
ఇక 'మహానటి'లో కూడా ఆయన 'ఒకరి కథ తెలుసుకుందామని వెళ్లా..కానీ ఒక చరిత్ర తెలుసుకున్నా...ప్రతిభ ఇంటి పట్టున ఉండిపోతే పుట్టగతులు ఉండవు' అనే డైలాగ్‌లు నిజజీవితాలను పరిశీలిస్తే కానీ రావని చెప్పాలి. ఇక ఈయన ప్రస్తుతం 'సైరా..నరసింహారెడ్డి' బయోపిక్‌కి కూడా రచయితగా వ్యవహరిస్తున్నాడు.