అల్లు అర్జున్ సినిమాలకి డివైడ్ టాక్ వచ్చినా వసూల్ పరంగా బాగానే ఉంటాయని తన గత సినిమాలు చూస్తే మీకే అర్ధం అవుతుంది. కానీ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ 'నా పేరు సూర్య' విషయంలో అలా జరగడం లేదు. ఈ సినిమాను కొన్న బయర్స్ కు నష్టాలు తప్పేలా లేవు. బన్నీ లాస్ట్ మూవీ ‘డీజే’ ఇంతకంటే ఎక్కువ డివైడ్ టాక్ తెచ్చుకుని కూడా తొలి వారాంతంలో భారీ వసూళ్లు సాధించింది.
కానీ 'నా పేరు సూర్య' సినిమా నంబర్స్ మాత్రం అలా లేవు. తొలి వీకెండ్ లో యావరేజ్ వసూళ్లతో సరిపెట్టుకుందీ చిత్రం. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాను కొన్న బయ్యర్లకు లాస్ తప్పకపోవచ్చు. ఆ లాస్ ఎంత అన్నది ఈ వీకెండ్ లో తెలుస్తుంది. అయితే తెలుగు రాష్ట్రాల సంగతి పక్కన పెడితే వేరే రెండు రాష్ట్రాల్లో ఈ సినిమా సేఫ్ జోన్లోకి వచ్చేలా కనిపిస్తోంది.
బన్నీకి మంచి ఫాలోయింగ్ ఉన్న కేరళలో ఈ సినిమా ‘ఎంటె పేరు సూర్య ఎంటె వీడు ఇండియా’ పేరుతో రిలీజైంది. అక్కడ ఈ సినిమాను రూ.1.5 కోట్లకు అమ్మగా.. వీకెండ్లో షేర్ బాగానే వచ్చిందని చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా దాదాపు సగం పెట్టుబడి వెనక్కి తెచ్చింది. ఫుల్ రన్లో బ్రేక్ ఈవెన్‌కు వచ్చే అవకాశముంది. మరోవైపు తమిళనాట కూడా ఈ చిత్రానికి పరిస్థితి ఆశాజనకంగా ఉంది. అక్కడ ఈ సినిమాను రూ.కోటికి అమ్మారు. ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. ఇంకో రెండు రోజుల్లో సినిమా బ్రేక్ ఈవెన్‌కు కూడా వచ్చేస్తుందని ట్రేడ్ అనలిస్ట్ కమ్ క్రిటిక్ శ్రీధర్ పిళ్లై చెప్పాడు. మన స్టేట్స్ లో ఎలా ఉన్న తమిళ్.. కేరళలో ఈ సినిమా సేఫ్ జోన్ కి వెళ్లే అవకాశముందని తెలుస్తుంది.