మంచితనం, అందరిలోనూ మంచితనం చూడటం సావిత్రిలో మనం గమనించవచ్చు. ఇక ఈమె నాటి షావుకారు జానకితో పలు చిత్రాలు కలసి చేసింది. జెమిని సంస్థవారు 'ముగ్గురు కొడుకులు' చిత్రం తీస్తున్నప్పుడు నేను వేషం కోసం వెళ్లాను, అప్పుడు జెమినిగణేషన్ నాకు పరిచయమై, నాకు వేషం ఇప్పించారు. ఆ తర్వాత నా కోసం అద్దె ఇల్లు కూడా చూసిపెట్టారు. ఆ క్రమంలో ఆయనతో కలిసి నేను చనువుగా, బ్రదర్ అంటూ పిలిచేదానిని. నాడు ఓసారి సావిత్రిని కలిశాను. అప్పటికీ ఈమె ఇంకా సినిమాలలోకి రాలేదు.
'సంసారం'లో చిన్న పాత్ర చేసి 'దేవదాసు'లో నేను చేయాల్సిన వేషాన్ని ఆమె చేసింది. నాడు సావిత్రి జెమినిగణేషన్‌తో నాకేదో ఉందని అపార్ధం చేసుకుంది. తర్వాత నేను ఆమెకి విషయం చెప్పడంతో సారీ చెప్పింది. ఇక సావిత్రికి వివిధ డిజైన్ల నగలు చేయించుకోవడం సరదా. నాడు ఆమె చెన్నైలో ఉన్న ఇంటి దగ్గరలోనే నేను కూడా ఉండేదానిని, సావిత్రికి నగల కోసం తంజావూరు నుంచొ కుంభకోణం నుంచో రంగస్వామి అయ్యంగార్ అనే నగల తయారీ దారుడిని జెమిని గణేషన్ పిలిపించే వారు. ఆయన మా ఇంట్లోనే ఉంటూ నగలు తయారు చేసేవాడు. సావిత్రి చేసికున్నటువంటి నగలే నేను కూడా చేయించుకునే దానిని.
ఓరోజు నేను వెండివస్తువులు కొనడం కోసం ఓ బంగారు షాప్‌కి వెళ్లాను. అక్కడ అంతా నా నగల వలే ఉన్న వాటిని ఓ వ్యక్తి బంగారు షాపు వాడికి అమ్ముతున్నాడు. నేను అవి నాతో పాటు చేయించుకున్న సావిత్రివి అని తెలుసుకుని, ఆ వ్యక్తిని ప్రశ్నించాను. అతను సావిత్రి ఇంట్లో పనిచేసే పనివాడు. చివరకు ఆ నగలను సావిత్రికి చెందేలా చేశాను. ఇలా ఆమె తెలియని తనాన్ని, మంచితనాన్ని చూసి ఎందరో ఆమెని మోసం చేశారు.. అని షావుకారు జానకి చెప్పుకొచ్చింది.