సినిమాలలో అయితే ఇంటర్వెల్ బ్యాంగ్, చివరి వరకు సస్పెన్స్‌లు అలరించి విజయాన్ని అందిస్తాయేమో గానీ రాజకీయాలలో ముక్కుసూటి తనం, సందర్భం వచ్చినప్పుడు ఓపెన్‌గా మాట్లాడటం, తమ భావాలను ప్రజలకు చెప్పడంలో మీనమేషాలు లెక్కించాల్సిన అవసరం లేదు. అది చాలా సార్లు చేటు కూడా చేస్తుంది. ఇక చిరంజీవి ప్రజారాజ్యం సమయంలో కూడా అందరు ఊహించిందే చేసి, దానికి సస్పెన్స్ అనే ముద్ర వేశాడు. ఇక చిరంజీవి చూపిన మార్గంలోనే ఆయన తమ్ముడు జనసేనాధిపతి పవన్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అనే సామెత వీరిద్దరికి సరిగ్గా సరిపోతుంది. పవన్‌తో నడవాలని వామపక్షలు ముందుకు వచ్చాయి. కానీ వామపక్షాలతో పొత్తు లేకుండానే మొత్తం 175 అసెంబ్లీ సీట్లలోనూ తాము ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పి వామపక్షాలకు రిక్త హస్తం చూపాడు.
ఇక తెలంగాణ విషయంలో మాత్రం ఆగష్టులో నిర్ణయం తీసుకుంటాడట. మరి అక్కడ ఆయన గద్దర్‌కి జై అంటాడా? లేక కోదండరాంకి జిందాబాద్ కొడతాడా? అనేది కూడా సూపర్‌సస్పెన్స్ థ్రిల్లర్‌ని మరిపిస్తోంది. ఇక పవన్ ఏపీలో టిడిపికి మద్దతు ఇచ్చే పరిస్థితిలేదు. ఇంతకాలం దోచుకున్న వాడు నాయకుడైతే సమాజానికి చేటని, తానేమీ ముఖ్యమంత్రి కొడుకును కాదని ఆయన జగన్, లోకేష్ ఇద్దరిపై వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి పవన్‌ని వెనుక నుంచి వైసీపీ, బిజెపిలు నడిపిస్తున్నాయని, ఇప్పుడు కేంద్రంలోని బిజెపికి వీస్తున్న వ్యతిరేక పవనాల వల్ల పవన్ కూడా వారితో కలిస్తే కొంప కొల్లేరు కావడం ఖాయమని చెప్పాలి.
ఇక ఈయన కర్ణాటకలో బిజెపికి మద్దతు ఇస్తుందని భావిస్తున్న జెడిఎస్ తరపున ప్రచారం చేయడం కూడా ఇందులో భాగమనే అనుమానం వస్తోంది. పవన్‌పై ఈ మద్య పలు సినీ విమర్శలు వచ్చినప్పుడు నిరాహార దీక్ష చేసి మౌన దీక్షతో పవన్‌కి మద్దతు ప్రకటించిన నటి మాధవీలత తాజాగా గడ్కరి, బండారు దత్తాత్రేయ, లక్ష్మణ్‌ల సమక్షంలో బిజెపిలో చేరింది. ఈ సందర్భంగా మీరు 'జనసేన'లో ఎందుకు చేరలేదు? అనే ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం చూస్తే పవన్ బిజెపి పావు అన్న వ్యాఖ్యలే గుర్తుకొస్తున్నాయి.
ఆమె దీనికి సమాధానం చెబుతూ, నాకు పవన్ అంటే ప్రాణం. ఆ స్థానం ఎప్పటికీ అలాగే ఉంటుంది. నేను బిజెపిలో ఉన్నా జనసేనకి మద్దతు పలుకుతాను. గతంలో జనసేన పార్టీ స్థాపించినప్పుడు కూడా ఆయన బిజెపికి మద్దతు ఇచ్చారు. మా ఇద్దరి ఐడియాలజీ ఒకటే..అని మాధవీలత పేర్కొంది. అసలే పవన్ బిజెపికి తొత్తుగా వ్యవహరిస్తున్నాడని విమర్శలు వస్తున్న వేళ మాధవీలత వ్యాఖ్యలు అగ్గికి ఆజ్యం పోసే విధంగానే ఉన్నాయి.