సావిత్రి బయోపిక్‌గా వస్తున్న 'మహానటి' చిత్రం ఈనెల 9వ తేదీన విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇక ఇందులో పలు పాత్రలను పలువురు ప్రముఖ నటీనటులు కామియోలు చేస్తారని యూనిట్ చెబుతూనే ఉంది. ఇక ఇందులో సావిత్రిగా కీర్తిసురేష్, దుల్కర్ సల్మాన్ జెమిని గణేషన్ పాత్రలను పోషిస్తున్నారు. ఇక సమంత, విజయ్‌దేవరకొండలు నాటి జర్నలిస్ట్‌గా కనిపిస్తున్నారు. మరోవైపు ఇందులో సావిత్రి తల్లి పాత్రను దివ్యవాణి, భానుమతి పాత్రను భానుప్రియ, కేవీరెడ్డి పాత్రను క్రిష్, ఎల్ వి. ప్రసాద్ పాత్రను శ్రీనివాస్ అవసరాలతో పాటు ఏయన్నార్‌గా నాగచైతన్యలు పోషిస్తున్నారు.
తాజాగా ఈ చిత్రం యూనిట్ ఓ వీడియోను రిలీజ్ చేసింది. హీరో నాని ఎస్వీరంగారావు పాత్ర గురించి పరిచయం చేస్తూ మాట్లాడాడు. నాని మాట్లాడుతూ, పౌరాణికమైన సాంఘికమైనా ఏ పాత్రలోనైనా ఒదిగిపోయే మహానటుడు ఎస్వీరంగారావు. మన ఘటోత్కచుడు ఎవరంటే ప్రతి తెలుగు వాడు ఎస్వీరంగారావునే ఇట్టే చెప్పేస్తారు. 'వివాహభోజనంబు.. వింతైనా వంటకంబు' అనని తెలుగు వాడు ఉండడు. ఇది అతిశయోక్తి కాదు. ఆ ఘనత ఎస్వీరంగారావుదే. అలాంటి మహానటుడిని మాయా శశిరేఖ అనుకరించి అందరి మెప్పుపొందిన మహానటి సావిత్రి. అలాంటి మహానటుడి పాత్రలో కనిపించేది ఎవరు అనుకుంటున్నారా? ఎస్..మీ గెసింగ్ కరెక్టే.
ఎస్వీరంగారావు పాత్రను పోషించగలిగిన ఒకే ఒక్క నటుడు, వన్ అండ్ ఓన్లీ ది గ్రేట్ డాక్టర్ మోహన్‌బాబుకే అదిసాధ్యం అవుతుంది... అని నాని చెప్పుకొచ్చాడు. ఇక ఈ చిత్రంలోని పాత్రల విషయంలో కాస్త క్లారిటీ వస్తోంది. 'అర్జున్‌రెడ్డి' ఫేమ్ షాలినిపాండే జమున పాత్రలో నటిస్తుందని సమాచారం. ఇక ఎన్టీఆర్ పాత్రను ఎవరు చేశారు? అనేది మరింత ఉత్సుకతను కలిగిస్తోంది.