నేటిరోజుల్లో ఎంత పెద్ద స్టార్ నటించిన చిత్రమైనా, ఎంత పెద్ద హిట్ చిత్రమైనా మొదటిరెండు మూడు వారాలకే పరిమితం అవుతున్నాయి. కానీ రామ్‌చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన 'రంగస్థలం' చిత్రం మాత్రం విడుదలై ఐదు వారాలు దాటుతున్నా ఇంకా విడుదలైన అన్ని సెంటర్లలో స్టడీ కలెక్షన్లు సాధిస్తోంది. ఈ చిత్రం చూసిన వారు ముక్తకంఠంతో ఒకే మాట అంటున్నారు. నిజంగా..రామ్‌చరణ్‌లో ఇంత టాలెంట్ ఉందా? అని ఆశ్చర్యపోతున్నారు.
ఆయన తన రెండో చిత్రం 'మగధీర'తోనే ఇండస్ట్రీ హిట్‌ని అందుకున్నా, ఆ క్రెడిట్ మొత్తం రాజమౌళి ఖాతాలో పడింది. ఆ తర్వాత ఆయన నటించిన చిత్రాలలో ఆయన నటన గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. 'గోవిందుడు అందరివాడేలో'లో కూడా ఆయన ప్రకాష్‌రాజ్ ముందు నటనలో నిలబడలేకపోయాడు. ఇక నాడు వచ్చిన వార్తల సారాంశం ఏమిటంటే.. మొదటి ప్రకాష్‌రాజ్ స్థానంలో తీసుకున్న తమిళ నటుడు రాజ్‌కిరణ్ అయితే చరణ్‌ని పూర్తిగా డామినేట్ చేశాడని, ఆయన డామినేషన్ ముందు చరణ్ తేలిపోవడం వల్లనే రాజ్‌కిరణ్ స్థానంలో ప్రకాష్‌రాజ్‌ని రీప్లేస్ చేశారని విశ్వసనీయమైన సమాచారం.
ఇక ఆ తర్వాత వచ్చిన మూస చిత్రాలలో ఆయన టాలెంట్‌ని పూర్తిగా ఆవిష్కృతం కాలేకపోయి సినిమాలు కూడా డిజాస్టర్స్‌గా నిలిచాయి. ఇక 'ధృవ'తో రూటు మార్చినా ఇందులో కూడా మేజర్ క్రెడిట్ అరవింద్‌స్వామినే దక్కించుకున్నాడు. ఎట్టకేలకు రామ్‌చరణ్‌లోని సంపూర్ణనటుడు 'రంగస్థలం'తో బయటికి వచ్చాడు. ఇక ఈ చిత్రంలోని 'రంగమ్మ.. మంగమ్మ' పాట ఎంత హిట్ అయిందో తెలిసిందే. ఈ పాటకు స్టెప్పులువేస్తూ పలువురు చిన్నారులు చేసిన డ్యాన్స్‌లు యూట్యూబ్‌లో అందరినీ అలరిస్తున్నాయి.
అయితే తాజాగా ఓ పాప పాటను, ఆమె డ్యాన్స్‌ని మాత్రం ఈ చిత్రం నిర్మాణ సంస్థ మైత్రిమూవీమేకర్స్ తమ అఫీషియల్ యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది. ఇందులో నటుడు, రచయిత ఉత్తేజ్ చిన్న కూతురు ఈ పాటను పాడుతూ, వేసిన స్టెప్స్ అదిరిపోతున్నాయి. ఇక ఈ పాటను రామ్‌చరణ్‌కి అనుగుణంగా మారుస్తూ పేరడీగా 'ఓరయ్యో, ఓరమ్మో, ఏం పిల్లాడు....ఇన్ని నాళ్లు ఏడదాగే ఇంత నటుడు' అంటూ ఉన్న ఈ పాట పేరడీ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పాటకి లిరిక్స్ జర్నలిస్ట్ ప్రభు అందించారు.