సాధారణంగా నేను ఏ పాత్ర చేసినా చిత్రీకరణ గ్యాప్‌లో రూమ్‌లోకి వెళ్లినప్పుడు ఎంతో ప్రశాంతంగా, ఆనందంగా ఉండేదానిని. కానీ 'మహానటి' విషయంలో మాత్రం చిత్రీకరణ సమయంలో ఉన్న ఆందోళనే.. గదిలోకి వెళ్లిన తర్వాత కూడా ఉండేది. ఎందుకిలా జరిగింది? అసలు ఆమె జీవితం ఇలా ఎందుకు తయారైంది? అని ఆలోచిస్తూ ఉండేదానిని, అంతలా ఆ పాత్రలో లీనమైపోయాను. జీవిత చరిత్రలు చేయడం అంత సులభం కాదు. అందులో నటించడానికి ఎంతో మానసిక స్ధైర్యం ఉండాలి. ప్రోస్తేటిక్ మేకప్ వల్ల తిండి కూడా తినే వీలులేదు. కేవలం ద్రవ పదార్దాలు మాత్రమే తీసుకునే దానిని. ఇక మేకప్ వల్ల నా మొహంపై మొటిమలు కూడా వచ్చాయి. అవి ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నాయి. అలాంటి మేకప్ వేసుకోవాలంటే ఎంతో ధైర్యం కావాలి. కానీ అంత కష్టపడినప్పటికీ ఇప్పుడు ఎంతో ఆత్మసంతృప్తిగా ఉంటోంది.
సావిత్రి స్థానం మరోకరు భర్తీ చేయలేనిది. ఆమె మంచితనం, విల్ పవర్ ఎంతో గొప్పవి. నువ్వు చేయలేవు అంటే దానిని చేసి చూపించే దాకా పట్టువదలని క్యారెక్టర్ ఆమెది. ఆమెలోని హాస్యచతురత, పారదర్శకంగా ఆలోచించే గుణాలు నాకు బాగా నచ్చాయి. సంప్రదాయంగా కనిపించడం అంటే నాకెంతో ఇష్టం. దాంతో సావిత్రి గారిలా చీరలో ఉండి పోవడం నాకెంతో తృప్తినిచ్చింది. ఒక సినిమా కోసం ఇలాంటి ప్రయాణం నేను ఇప్పటి వరకు చేయలేదు. పదిరోజుల్లో షూటింగ్ పూర్తవుతుంది అనగానే నాలో తెలియని భావోద్వేగం ఏర్పడింది. ఒక జీవిత చరిత్రలా కాకుండా ఓ మహానటి పరిపూర్ణ జీవితాన్ని ఆవిష్కరించేలా ఈ చిత్రం ఉంటుంది.
సావిత్రి గురించి అందరికీ తెలిసినా ఇది ఒక కొత్త కథని చూసిన అనుభూతిని కలిగిస్తుంది. అసలు ఇలాంటి అరుదైన అవకాశం వస్తుందని నేను భావించలేదు. ఇకపై మంచి పాత్రలనే చేయాల్సిన బాధ్యత నాపై ఉంది. అయితే కేవలం హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలే చేస్తానని కాదు. వాణిజ్యపరమైన చిత్రాలలో కూడా బలమైన పాత్రలే చేయాలని నిర్ణయించుకున్నాను అని అభినవ సావిత్రి అయినా కీర్తిసురేష్ చెప్పుకొచ్చింది.