మహానటి సావిత్రి బయోపిక్‌గా రూపొందతున్న 'మహానటి' చిత్రం 9వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, లుక్స్ జనాలను కట్టిపడేస్తున్నాయి. ఇందులో కీర్తిసురేష్ అచ్చు సావిత్రిలానే ఉందని ప్రశంసలు లభిస్తున్నాయి. ఇక ఈ చిత్రం గురించి కీర్తిసురేష్ మాట్లాడుతూ.. నేను 'రైల్' అనే తమిళ చిత్రం చేస్తున్నప్పుడు దర్శకుడు నాగ్ అశ్విన్ నన్ను చూశాడట. సావిత్రి ఎంతో అమాయకురాలు. ఆమె కెరీర్ మొదట్లో మరింత అమాయకురాలు. నాలో ఆ అమాయకత్వమే నాగ్ అశ్విన్‌కి నచ్చింది. 'రైల్'లో ఓ పాట చూసి ఈమెనే సావిత్రి పాత్రను చేయించాలని ఆయన డిసైడ్ అయ్యారట. ఇక ఈ చిత్రం గురించి మొదట నాకు చెప్పింది మాత్రం నాని.
'నేను లోకల్' షూటింగ్‌లో నాని సావిత్రిపై బయోపిక్ తీయనున్నారు. మీరు అందులో నటిస్తే బాగుంటుంది అన్నారు. ఏదో తమాషాకి అన్నారని భావించాను. కానీ అనుకోకుండా నాగ్‌అశ్విన్, ప్రియాంకాదత్, స్వప్నదత్‌లు వచ్చి నన్నే చేయమన్నారు. కథలో, నా పాత్ర చిత్రీకరణలో ఏదైనా తేడా వస్తే ఎలా అని చాలా భయం వేసింది. కానీ వారే నువ్వు ఈ పాత్రను చేయగలవు అని నమ్మకంగా చెప్పారు. ఇక ఈ చిత్రం కోసం రోజుకి 9, 10గంటలు పనిచేశాను. ప్రోస్థటిక్ మేకప్ కోసమే నాలుగుగంటలు పట్టేది. ఆ తర్వాత ప్యాడింగ్ చేసుకుని కెమెరా ముందుకు వెళ్లేదానిని. లుక్స్‌పరంగా నాకు అనేక అనుమానాలు ఉండేవి. ఈ పాత్ర కోసం 120పైగా కాస్ట్యూమ్స్‌లో అన్నిరకాల లుక్‌లలో నేను నటించినా కూడా నేను సావిత్రిలా కనిపిస్తానా? లేదా? అనే అనుమానం ఉండేది.
కానీ ఫస్ట్‌లుక్, టీజర్ విడుదల తర్వాత నాకు నమ్మకం కలిగింది. బొట్టు, పెదాలు, జుట్టు ఇలా అన్ని విషయాలలో ఎంతో జాగ్రత్త తీసుకుని నటించాను. హావభావాల కోసం సావిత్రి గారి సినిమాలని, ఆమె నటించిన వీడియో చిత్రాలను బాగా చూసేదాన్ని. ఇందులో సావిత్రి సినీ జీవితానికి సంబంధించి 20శాతం ఉంటే, మిగిలిన 80శాతం ఆమె నిజజీవితానికి సంబంధించి ఉండేవి. అయితే 'మాయాబజార్' చిత్రంలోని సీన్స్ తీసేటప్పుడు మాత్రం ఎంతో కష్టపడ్డాను. దర్శకుడు ఈ హావభావాలు బాగానే ఉన్నాయి కదా అన్నా కూడా కాదు.. ఇంకా ట్రై చేస్తాను అని చెప్పి నటించేదానిని అని చెప్పుకొచ్చింది.