ఈ మధ్య వరుసగా విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్ బిజెపిపై మాటల యుద్దం కొనసాగిస్తున్నాడు. ముఖ్యంగా బెంగుళూర్‌లో సామాజిక కార్యకర్త, పత్రికాధిపతి అయిన గౌరీలంకేష్‌ని కొందరు చంపేసినప్పటి నుంచి ఆయన అసలు తట్టుకోలేకపోతున్నాడు. ఈ విషయంలో మోదీ మౌనంపై ఆయన గళమెత్తుతూ వస్తున్నారు. తాజాగా కూడా ఆయన బిజెపిపై ఘాటు విమర్శలు చేశారు. తాను మోదీని, బిజెపిని తిట్టినప్పటి నుంచి తనను బాలీవుడ్ ప్రముఖులు పక్కనపెట్టేశారని, తనకు అవకాశాలు ఇవ్వడం లేదని అన్నాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. నా వద్ద కావాల్సినంత డబ్బు ఉంది. కాబట్టి బాలీవుడ్‌లో అవకాశాలు రావడం లేదని నేను టెన్షన్ పడను. ఎప్పుడు ప్రశ్నించే గొంతుక గౌరీలంకేష్ హత్యని తాను జీర్ణించుకోలేకపోతున్నాను. నేను మాట్లాడే కొద్ది నన్ను నిశ్బబ్దంగా ఉంచేందుకు ప్రయత్నాలు, బెదిరింపులు ఎక్కువయ్యాయి. అయినా నా వ్యక్తిత్వాన్ని ఎవరిని చూసో భయపడి మార్చుకోను. అమిత్‌షాకి భయపడాల్సిన అవసరం మనకి ఉందా? ఆయన ఇప్పటివరకు దేశం మంచికోసం ఏమైనా చేశాడా? ఆయన చాణక్యుడని, ప్రభుత్వాలు పడగొట్టడం, ఏర్పాటు చేయడంలో ఆయన సిద్దహస్తుడే కావచ్చు. కానీ అవ్వన్నీ నాకు అవసరమా? అని ప్రశ్నించాడు.
రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, నల్ల కుబేరుల అంతు చూస్తామని బిజెపి అధికారంలోకి వచ్చింది. మరి మోదీ ఈ విషయంలో ఏమైనా చేయగలిగారా? బిజెపి వారు ఎప్పుడు చూసినా గతం గురించే మాట్లాడుతారు. నెహ్రూ ఏమిచేశాడు? టిప్పు సుల్తాన్ ఏమి చేశాడు? మన సనాతన సంప్రదాయం ఏమిటి? వంటి పాత విషయాలను లేవనెత్తుతున్నారు. తన ముత్తాత సంగతే తనకి తెలియదని, ఇక టిప్పుసుల్తాన్ గురించి నాకేం తెలుసు? అంటూ ఆయన ఎద్దేవా చేశాడు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిని దేశద్రోహులుగా, హిందూ వ్యతిరేకుల ముద్ర వేస్తారు. పాకిస్తాన్‌కి పోవాలని డిమాండ్ చేస్తారు. పాకిస్తాన్‌కి కాకుండా ఏదైనా రిసార్ట్స్‌కి పంపిస్తే బాగుంటుంది కదా.. అని చురక వేశాడు.
వారి మనసుల్లో పాకిస్థాన్ నిండి పోయింది కాబట్టి వారు పాకిస్థాన్ గురించే మాట్లాడుతారు. పాకిస్థాన్‌కి ముస్లిం అధికార మతం. ఆదేశం పేదరికంతో మగ్గిపోతోంది. మనం కూడా అలాగే ఉండాలని మన బిజెపి నాయకులు కోరుకుంటున్నారా? ఏ పార్టీలో చేరడం గానీ, పార్టీ పెట్టే ఉద్దేశ్యం తనకి లేదని, నేటి రోజుల్లో ప్రశ్నించే గొంతుకలు వినిపించాల్సిన అవసరం ఉంది. రాజకీయ చైతన్యంలోనే అసలైన రాజకీయం ఉంది. నేను రెండు మూడు నెలలు ప్రశ్నించి మౌనంగా ఉండే వ్యక్తిని కాదు. నాలో సహనం ఉంది. రాత్రికి రాత్రి దేశాన్ని మార్చేయలేం... అంటూ ప్రకాష్‌రాజ్ చెప్పుకొచ్చాడు!