ఈ ఏడాది అతిలోక సుందరి హఠాన్మరణం గురించి ఎవ్వరూ ఇంకా కోలుకోలేకపోతున్నారు. తెలుగు, తమిళం, హిందీలలో ఒక్కో భాషలో 70కిపైగా చిత్రాలలో నటించిన ఈమె నటించిన ఆఖరి చిత్రం 'మామ్'. తన సవితి కూతురు ప్రమాదంలో పడితే ఆమెని శ్రీదేవి ఎలా కాపాడుతుంది? అనే అంశంపై ఈ 'మామ్' చిత్రం ఆధారపడి ఉంది. ఇక 'మామ్' చిత్రానికిగాను శ్రీదేవికి జాతీయ ఉత్తమ నటి అవార్డు లభించింది.ఈ అవార్డును తాజాగా రాష్ట్రపతి రామ్‌నాద్ కోవింద్‌చేతుల మీదుగా శ్రీదేవి భర్త బోనీకపూర్, శ్రీదేవి కుమార్తెలు జాన్వి కపూర్, ఖుషీ కపూర్‌లు కలిసి అందుకున్నారు. ఇక ఈ అవార్డు శ్రీదేవికి వచ్చినందుకు సంతోషించాలా? లేక బాధపడాలా? అనేది అర్ధం కాకుండా అయోమయంగా ఉందని, ఈ వేడుకలో శ్రీదేవి బతికి ఉండి పాల్గొని ఉంటే ఎంతో సంతోషంగా ఉండేదని, ఉద్వేగానికి లోనైన బోనీకపూర్ కంట తడి పెట్టారు.
ఇక ఈ వేడుకకు శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి కపూర్ తన తల్లికి చెందిన చీరకట్టుతో అద్భుతంగా ఉంది. ఇక ఈ చిత్రాన్ని బోనీకపూర్ నిర్మించగా, రవి దర్శకత్వం వహించాడు. కధా సహకారం కోనవెంకట్ అందించడం విశేషమేనని చెప్పాలి. శ్రీదేవి కెరీర్‌లో 'మామ్' చిత్రమే చివరిది అవుతుందని తాము కలలో కూడా ఊహించలేదని బోనీకపూర్, పిల్లలు జాన్వీ, ఖుషీలు కన్నీరుపెట్టుకున్న సంఘటన చూస్తే ఎవరికైనా హృదయం ద్రవించకమానదు.
ఇక త్వరలో బోనీ ఇంట అనిల్‌కపూర్ కుమార్తె సోనం కపూర్ వివాహం జరగనుండటం, జాన్వీ తెరంగేట్రం చేస్తోన్న మరాఠి చిత్రం 'సైరత్'కి రీమేక్‌గా వస్తున్న 'ధడక్' చిత్రాలు విడుదల కానున్నాయి. వీటి ద్వారా అయినా బోనీ, జాన్వి, ఖుషీలు కాస్త హ్యాపీమూడ్‌లోకి వస్తారనే చెప్పాలి.