తెలుగు సినీ నటనకు పెట్టనికోట కోట శ్రీనివాసరావు. ఎలాంటి పాత్రలోఅయినా పరకాయ ప్రవేశం చేసి రక్తి కట్టించే వారిలో ఈయన నేడు ప్రధముడు. ఇక ఈయన తాజాగా మాట్లాడుతూ.. సినిమాలలోకి వెళ్లాలని ఉన్నా అభద్రతా భావంవల్ల ఉద్యోగం చేస్తూనే నాటకాలు వేసేవాడిని. ఉద్యోగం కూడా వదులుకుని అవకాశాలు రాకపోతే రెంటికి చెడతామనే భయం ఉండేది. కానీ నాడు ఏరోజు నా ఫొటోలు పట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరగలేదు. నాడు ఆర్టిస్టులు అంటే ఆజానుబాహులుగా, మంచి తెల్లని శరీరంతో అందంగా ఉండాలనే అపోహ నాలో ఉండేది. కానీ నేను నల్లగా ఉంటాను. దాంతో ఎవరినైనా అవకాశాల కోసం అడుగుదామంటే అద్దంలో మొహం చూసుకున్నావా? అంటారని భయంగా ఉండేది. నా అదృష్టం కొద్ది నేను రవీంద్రభారతిలో చేసిననాటకాన్ని టి.కృష్ణ, ఆయన అసోసియేట్ ముత్యాల సుబ్బయ్యగారు చూశారు.
అప్పుడు టి కృష్ణ 'వందేమాతరం' చిత్రం చేసేటప్పుడు ఓ పాత్రను రంగస్థలం నటుడైతే బాగుంటుందని భావించడం, ముత్యాల సుబ్బయ్యగారు నా పేరును సూచించడంతో నాకా అవకాశం వచ్చింది. ఇక నేను పరాయి నటులను వద్దన్నాననే విమర్శ ఉండేది. కానీ నేను మంచి టాలెంట్ ఉన్నవారికే అవకాశాలు ఇవ్వమని చెబుతున్నాను. నానాపాటేకర్, ఓంపురి, అమితాబ్ వంటి వారు మన చిత్రాలలో నటిస్తే వారి అసిస్టెంట్‌గా చిన్న పాత్ర అయినా చేయడానికి నేను రెడీ.ఇక కొత్తగా సినిమాలలోకి వద్దామనుకునే వారికి నాది ఓ సలహా.
సినిమాలలో నటుడు, దర్శకుడు, సాంకేతిక నిపుణులుగా ప్రవేశించాలని అడుగు పెట్టే వారికి నేను చెప్పేది ఒకటే. సాధన చేయాలి, సాధన చేయకుండా ఉంటే ఫుడ్‌కి లాటరీలు కొట్టాల్సిందే. సాధన లేకపోవడంవల్ల రాణించలేక పోవడం వేరు. టాలెంట్ ఉండి, విద్వత్ ఉన్న అవకాశాలు రాకపోవడం వేరు. నాకు నాటకానుభవం ఉన్నందున ఎలాంటి పాత్రలు వచ్చినా చేస్తూ ఉండి నిలబడ్డాను. ఎవరైనా సర్దిచెప్పుకోవడానికి ప్రయత్నించవద్దు. సాధన చేయాలి. ఒకరి నటన బాగున్నా, ఒక చిత్రం బాగున్నా దాని వెనుక ఎంతో సాధన ఉందని గుర్తించాలి అని చెప్పుకొచ్చాడు.