నేటిరోజుల్లో సోషల్‌మీడియాలో ప్రమోషన్ చేయడం...పార్టీ సిద్దాంతాలను మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి వాటికి కూడా పార్టీ వ్యూహకర్తలంటూ కొందరు బయలు దేరుతున్నారు. పోయిన సార్వత్రిక ఎన్నికల సమయలో మోదీ నియమించుకున్న వ్యూహకర్తల వ్యూహం బాగానే పనిచేసింది. అయితే పార్టీ నాయకులు, ప్రజల్లో ఉన్నవారు, మరీ ముఖ్యంగా పార్టీ అధినేతలే వ్యూహకర్తలుగా ఉంటే అదే బాగా వర్కౌట్ అవుతుంది గానీ ఎక్కడి నుంచో తీసుకుని వచ్చి ఎన్నికల వ్యూహకర్త అని పరిచయం చేయడం జిమిక్కుగానే కనిపిస్తుంది కానీ ఇది మన ఏపీకి సంబంధించి సక్సెస్ ఫార్ములా కాదు.
ఇక ఇప్పటికే వైఎస్‌జగన్‌కి వైసీపీ తరపున ప్రశాంత్ కిషోర్ అనే వ్యూహకర్త ఉన్నాడు. ఈయన ఉత్తరాది ఓటు బ్యాంకుని అంచనా వేయగలిగిన నిఫుణుడే గానీ ఈయన వ్యూహాలు తెలుగు నేల మీద సక్సెస్ అయ్యే అవకాశాలులేవు. ప్రశాంత్‌కిషోర్ అలియాస్ పీకే వ్యూహం నంద్యాల ఎన్నికల్లో కూడా బెడిసి కొట్టింది. ఇక ఇప్పుడు తాజాగా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ అలియాస్ పీకే తమ పార్టీ వ్యూహకర్త అంటూ దేవ్ అనే వ్యక్తిని పరిచయం చేశాడు. ఈ సందర్భంగా దేవ్ తనని తాను పరిచయం చేసుకుంటూ పార్టీ పటిష్టానికి కృషిచేయాలని పిలుపునిచ్చాడు.
'జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నాకు పలు జాతీయ, అంతర్జాతీయ పార్టీలతో కలసి పనిచేసిన అనుభవం ఉంది. ఈ రంగంలో దశాబ్దకాలంగా ఉన్నాను. గొప్ప దృక్పథం ఉన్న నాయకుడు పవన్‌కళ్యాణ్. ఎన్నికలప్పుడు వచ్చి మొహం చూపించివెళ్లే నాయకుడు కాదు. ఆయనకు ప్రజాసమస్యలు, సామాజిక అంశాల పట్ల సరైన దృక్పథం ఉంది. జనసేనకు బలమైన సిద్దాంతాలు, భావజాలాను రూపొందించారు' అని చెప్పుకొచ్చాడు. అసలు పవన్‌కే తనకి తానే తన నిర్ణయాలపై, సిద్దాంతాలపై స్పష్టత లేని సమయంలో పవన్‌కల్యాణ్ సిద్దాంతాలు, దృక్పధాల గురించి దేవ్ గొప్పగా చెప్పడం జోక్‌గా ఉంది.
పవన్ సొంతవ్యూహంతో ముందుకెళ్లాలే గానీ ఇలా ప్రశాంత్ కిషోర్, దేవ్ వంటి వారిని పెట్టుకోవడంవల్ల ఏమాత్రం ఉపయోగంలేదని గుర్తుంచుకోవాలి. చంద్రబాబుతో తలపడగలిగిన వ్యూహకర్తగా పవన్ పరిణతి సాధిస్తేనే ఆయనకు గుర్తింపు ఉంటుంది. కానీ ఎవరికో ఆ ముఖ్యమైన విషయాలను వదిలేస్తే మాత్రం ప్రమాదం తప్పదు. ఇక అసలు మీడియానే వద్దనుకున్నప్పుడు ఆయనపార్టీకి మీడియా ప్రతినిధులు, అధికార ప్రతినిధులతో కూడా పనేముంది? అనేది ఆలోచించాల్సిన విషయం.