నేటిరోజుల్లో కథకు తగిన టైటిల్ ఎంత ముఖ్యమో 'రంగస్థలం, భరత్ అనే నేను' చిత్రాలు నిరూపించాయి. ఇక ప్రస్తుతం రామ్‌చరణ్ దానయ్య నిర్మాతగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ పక్కా హైఓల్టేజ్ యాక్షన్ స్టోరీ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఇందులో రామ్‌చరణ్ లేని సన్నివేశాలను బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నాడు. ఇక తాజాగా రామ్‌చరణ్ కూడా ఈ యూనిట్‌తో జాయిన్ అయ్యాడు. ఈ చిత్రంలో 'భరత్ అనే నేను' చిత్రంలో నటించిన కైరా అద్వానీ హీరోయిన్‌గా నటించనుంది. మొత్తానికి 'భరత్ అనే నేను', ఇప్పుడు రామ్‌చరణ్-బోయపాటి శ్రీను చిత్రం, దీని తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లు నటించే మల్టీస్టారర్ చిత్రాలను కూడా దానయ్యే నిర్మిస్తున్నాడు. నిజానికి మొదటి నుంచి దానయ్య నిర్మాతగా ఎన్నో విజయాలు సాదించినా ఆయనకు వ్యక్తిగతంగా పేరు రాలేదు. ఇప్పుడు మాత్రం ఆయన ఇండస్ట్రీలో పెద్ద నిర్మాతగా గుర్తింపును అందుకుంటున్నాడు.
ఇక బోయపాటి శ్రీను చిత్రాలలో హీరోలు ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటారో టైటిల్స్, విలన్లు కూడా అంతే పవర్‌ఫుల్‌గా ఉంటారు. మొదట బోయపాటి శ్రీను, చరణ్, దానయ్యలు కలిసి ఈ చిత్రానికి 'రాజ వంశస్థుడు' అనే టైటిల్‌ని పెట్టాలని భావించారట. కానీ ఈ టైటిల్ బాగా లేదని ఫీడ్ బ్యాక్ రావడమే కాదు... బోయపాటిశ్రీను, రామ్‌చరణ్‌ల వంటి పవర్‌ఫుల్ కాంబినేషన్‌కి ఈ టైటిల్ యాప్ట్‌గా లేదనే నిర్ణయానికి వచ్చారట. ఇక తాజాగా ఈ చిత్రానికి 'రాజ మార్తాండ' అనే టైటిల్‌ని పెట్టాలనుకుంటున్నట్లు సమాచారం.
గతంలో చిరంజీవి ఓ తమిళ రీమేక్‌ని రవిరాజా పినిశెట్టితో కలిసి 'రాజా విక్రమార్క' అనే టైటిల్‌తో సినిమా తీశాడు. కానీ ఈ చిత్రం సరిగా ఆడలేదు. అయినా ఈ సెంటిమెంట్ చరణ్‌కి వర్కౌట్ అవుతుందనే భావించవచ్చు. ఉదాహరణకు చిరంజీవి నటించిన 'మగధీరుడు' చిత్రం ఫ్లాప్ అయినా రామ్‌చరణ్ నటించిన 'మగధీర' బ్లాక్‌బస్టర్ అయింది. అదే తరహాలో 'రాజా విక్రమార్క' ఆడకపోయిన 'రాజ మార్తాండ' అనే టైటిల్ మాత్రం పవర్‌ఫుల్‌గానే ఉంది. మరి ఈ చిత్రానికి టైటిల్ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సివుంది...!.