మన సినిమా ఫీల్డ్‌లో ఉండే దరిద్రం ఏమిటంటే ... నటీనటులు గానీ సాంకేతిక నిపుణులకు ఏ చిత్రంతో అయితే పేరు వస్తుందో వారిని ఇక అదే గాటన కట్టేస్తారు. అలాంటి వారిలో మిక్కీ జె మేయర్ ఒకరు. ఈయన మీద క్లాస్ చిత్రాల, ప్రేమకథా చిత్రాల సంగీత దర్శకుడు అనే ముద్ర ఉంది. ఆయన మాస్ చిత్రాలకు పనిచేయలేడనే అపోహ కూడా ఉంది. కానీ చాన్స్ ఇస్తేనే కదా విషయం తెలిసిందే. ఇక మిక్కీ జె మేయర్‌ని అదే గాటన కట్టివేయడం మూలంగా ఆయనకు సావిత్రి బయోపిక్ అయిన 'మహానటి'కి సంగీతం అందించే చాన్స్ వచ్చింది.
తాజాగా ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న మిక్కీ జె మేయర్ మాట్లాడుతూ.. 'మహానటి' చిత్రానికి తానెంత కష్టపడ్డాడో వివరించాడు. ఆయన మాట్లాడుతూ, 'మహానటి' చిత్రం నా కెరీర్‌లో గుర్తిండిపోయే చిత్రంగా నిలిచిపోతుంది. సావిత్రి నిజజీవితంలో ఏయే సంఘటనలు జరిగాయో మనకు తెలియదు. ఈ సినిమా ఆమె జీవితానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. ఈ సినిమాలో భాగం కావడం నా అదృష్టం. సంగీత దర్శకునిగా నన్ను ఎంపిక చేసినందుకు ఎంతో సంతోషం వేసింది. ఈ సినిమాకు చక్కని బాణీలు అందించేందుకు ఒకటిన్నర ఏళ్లగా కష్టపడుతున్నాను. పాటలు బాగా వచ్చాయి. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన కూడా లభిస్తోంది. నాకు ప్రయోగాలు చేయడం అంటే ఇష్టం. కొన్ని ప్రేక్షకులకు నచ్చుతాయి. కొన్నినచ్చవు. ఈ సినిమాలో నేపధ్య సంగీతం అందించడం కోసం 'మహానటి' అనే పదాన్ని సరిగా పలకలేక 'మహనటి' అని రాసుకున్నాను. తర్వాత తప్పుని సరిచేశాం.
పాటల కోసం భారతీయ సంగీత పరికరాలనే వాడాను. ఇది బయోపిక్ కాబట్టి అన్ని నేనే చూసుకున్నాను. సావిత్రి నటించిన చిత్రాలలోని పాటలను రీమిక్స్ చేయలేదు. కానీ 'అహనా పెళ్లంట' వంటి పాటలను సినిమాలో భాగంగా చూపించబోతున్నాం. సావిత్రి గారంటే మనకి ఎంత ప్రేమ, అభిమానమో తెలిసిందే. అలాంటి చిత్రాలు చేసేటప్పుడు ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లుగా సంగీతం అందించాలి. నాగ్ అశ్విన్‌చాలా కాలంగా తెలుసు. ప్రశాంతంగా ఉన్నట్లు కనిపిస్తాడు గానీ పనిలో పడితే ఏదీ లెక్కచేయరు. తెలిసిన వ్యక్తే కాబట్టి ఆయనతో పనిచేయడం ఎంతో సౌకర్యవంతంగా అనిపించింది. సావిత్రి బయోపిక్‌గా ఆలోచన రావడమే ఆయనకు గ్రేట్ అని చెప్పుకొచ్చాడు.