మామూలు కమర్షియల్ చిత్రాలు చేయడం వేరు.. మహామహులకు సంబంధించిన బయోపిక్స్‌ని రూపొందించడం ఎంతో కష్టమైన,క్లిష్టమైన పని. నాటి కాలం నాటి పరిస్థితులు, వాతావరణం, వారి కట్టుబొట్టు తీరు... ఇలా ప్రతిది ఆచితూచి పరిశోధన చేసి విషయాలను రీసెర్చ్ చేయాల్సివుంటుంది. ఏమాత్రం తేడా వచ్చినా ఆయా మహావ్యక్తుల బయోపిక్స్ నవ్వుల పాలు అవుతాయి. ఇక ఇప్పుడు ఒకే ఒక్క సినిమా అనుభవం ఉన్న 'ఎవడే సుబ్రహ్మణ్యం' ఫేమ్, అశ్వనీదత్ అల్లుడు నాగ్‌అశ్విన్ పెద్దప్రయోగం, సాహసమే చేస్తున్నాడని చెప్పాలి. అలనాటి మేటి నటి మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా 'మహానటి' చిత్రాన్ని కీర్తిసురేష్, సమంత, విజయ్‌దేవరకొండ, నాగచైతన్య, మోహన్‌బాబు, ప్రకాష్‌రాజ్ వంటి మహామహులతో చిత్రం చేస్తున్నాడు.
మరోవైపు సావిత్రి అంటే దక్షిణాదిన అందరికీ తెలిసిన నటి జీవితం కావడంతో ఆయన ఈ చిత్రాన్ని ఓ సాహసంగా చేస్తూ ఒకేసారి తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రూపొందించాడు. ఇందుకోసం ఆయన మలయాళ నటీనటులైన కీర్తిసురేష్, దుల్కర్ సల్మాన్‌లను సావిత్రి, జెమిని గణేషన్ పాత్రలకు ఎంచుకున్నాడు. తెలుగు అమ్మాయి అయిన సావిత్రి పాత్రం కోసం ఓ మలయాళ నటిని తీసుకోవడంపై కొందరిలో కోపం వుంది. జమున వంటి వారు ఈ విషయాన్ని ఆల్‌రెడీ వేలెత్తి కూడా చూపారు. కానీ కళాకారులకు ప్రాంతీయ బేధాలు లేవని చెప్పాలి. అందునా ఈ చిత్రంలో నటిస్తున్న కీర్తిసురేష్ ఎంతో ప్రతిభ కలిగిన నటి కూడా.
ఇక విషయానికి వస్తే ఈ చిత్రం ఈనెల 9 వ తేదీన విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రంలోని పోస్టర్స్, టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. ఇక తాజాగా ఏయన్నార్, సావిత్రి నటించిన 'దేవదాసు' చిత్రంలోని సావిత్రి గెటప్‌లో, అదే రకం కాస్ట్యూమ్స్, హావభావాలు గుర్తుకు తెచ్చేలా కీర్తిసురేష్ స్టిల్‌ని తాజాగా విడుదల చేశారు. ఇందులో కీర్తిసురేష్ అచ్చుసావిత్రికి చాలా దగ్గరగా ఉండటం చూస్తే నాగ్ అశ్విన్ ఆమె పాత్ర కోసం చేసిన రీసెర్చి ఏమిటో అర్దమవుతోంది. మరి ఆయన, ఆయన టీం కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుందా లేదా అనేది తెలియాలంటే ఈనెల 9వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే...!