మే 4వ తేదీన విడుదల కానున్న 'నాపేరు సూర్య..నా ఇల్లు ఇండియా' ప్రీరిలీజ్ వేడుకలో హీరో అల్లుఅర్జున్ మాట్లాడుతూ, ఎప్పటి నుంచో నిజాయితీ కలిగిన చిత్రం చేయాలని ఆశపడుతున్నాను. ఆ కోరిక ఇప్పుడు తీరింది. ఈ కథ నా వద్దకు రావడమే అదృష్టం. రేపు సినిమా విదుదలయ్యాక విజయవంతం అయ్యాక దానికి కారణాలు వంద అనుకుంటే.. అన్నింటికి కారణం ఈ చిత్ర దర్శకుడే. నేను ఏదైనా చేశానంటే దర్శకుడు వంశీని నమ్మడమే. మిగతా అంతా ఆయనే చూసుకున్నారు. నేను గర్వపడే చిత్రం ఇది. అంతకంటే ఎక్కువ చెప్పలేను. రామ్‌చరణ్ ఈ వేడుకకు కొత్త కళ తీసుకుని వచ్చాడు. 'రంగస్థలం'తో మేము గర్వపడేలా చేశాడు రామ్‌చరణ్. హిట్ సినిమా అని కాదు. ఇండస్ట్రీని ఓ ఎత్తు ఎత్తాడు. 'భరత్ అనే నేను' కూడా బాగా ఆడుతోంది. మా సినిమాతో హ్యాట్రిక్ నమోదు అవుతుంది. ఆ తర్వాత రాబోయే 'మహానటి, మెహబూబా' చిత్రాలు కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నాను... అని చెప్పుకొచ్చాడు.
ఇక దర్శకుడు వక్కంతం వంశీ మాట్లాడుతూ.. సినిమా పరిశ్రమకి నన్ను పరిచయం చేసిన గురువు దాసరి నారాయణరావుగారు. ఆయన ఈ చిత్రం చూస్తారని అనుకున్నాను. ఇంత భాధలో కూడా ఆనందించే విషయం ఏమిటంటే.. ఈ సినిమా దాసరి పుట్టినరోజున విడుదల కాబోతోంది. మంచి కథ రాసుకున్నాక దానిని బన్నీకి చెప్పడానికి సహాయం చేసిన వ్యక్తి నల్లమలుపు బుజ్జి. ఎంతో అదృష్టం ఉంటేనే లగడపాటి శ్రీధర్, నాగబాబు, బన్నీవాస్ వంటి నిర్మాతలు దొరుకుతారు. నమ్మి చెప్పింది చెప్పినట్లు తీయ్ వంశీ అన్నారు. మంచి సినిమా తీసి అందరి నమ్మకాన్ని నిలబెట్టాను. అందరిని అలరించే అద్భుతమైన సినిమా. అల్లుఅర్జున్ వల్ల ఓ మంచి చిత్రం తీశాను... అన్నారు.
ఇక నిర్మాత లగడపాటి శ్రీదర్ మాట్లాడుతూ.. పదేళ్ల కిందట నేను చేసిన రెండు చిత్రాలు చూసిమీకు సినిమా చేస్తానని బన్నీ మాటిచ్చాడు. ఇక నేను దాదాపు సినీ పరిశ్రమనుంచి వైదొలగుదామని అనుకుంటున్న తరుణంలో బన్నీ ఈ చాన్స్ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత ఆఖరి శ్వాస వరకు సినిమాలలోనే ఉండాలని అనుకుంటున్నాను. వక్కంతం వంశీ ఆలోచనలు ఎంతో బాగున్నాయి. సామాజిక బాధ్యతతో కూడిన కథ రాసుకుని బన్నీకి చెప్పడం, బన్నీకి నచ్చి ఎన్నోఏళ్ల కిందట ఇచ్చిన మాటను గుర్తు పెట్టుకుని నాకు చాన్స్ ఇవ్వడం అంతా ఒక కలలా అనిపిస్తోంది. నా కల నిజమైందుకు చెప్పలేనంత ఆనందంగాఉంది. ఈ సినిమాలోని ఓ ముఖ్యమైనపాత్రకి ఎవరు బాగుంటారా? అని ఆలోచిస్తున్నసమయంలో అర్జున్ పేరు చెప్పారు బన్నీ. ఓ సారి ఓ కథతో ఆయన వద్దకు వెళ్లితే ఎలాంటి సినిమాలు తీస్తే పైకొస్తారో చెప్పిన వ్యక్తి అర్జున్. ఈ పాత్రను చేయడానికి ఆయన ఎంతో ఆలోచించి ఒప్పుకున్నారు. ఇద్దరు అర్జున్‌ల కలయికలో ఈ చిత్రం ప్రేక్షకుల మనుసుల్లో బలమైన ముద్రవేస్తుంది. మాకు రెట్టింపు ఆత్మవిశ్వాసం ఇచ్చిన చిత్రం ఇది. నేరుగా సినిమాని తమిళంలో తీయాలని భావిస్తే బన్నీ డబ్బింగ్ చేయమని సలహా ఇచ్చాడు. తెలుగు, తమిళం, మలయాళంలో ఒకేసారి విడుదల చేసి, తర్వాత హిందీలో విడుదలచేస్తామని తెలిపాడు.