తాజాగా అల్లుఅర్జున్ హీరోగా నటిస్తున్న 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' చిత్రం మే4వ తేదీన విడుదలకు సిద్దమవుతోంది. యావరేజ్ కంటెంట్‌తో కూడా కలెక్షన్లు కొల్లగొడుతున్న అల్లుఅర్జున్ నటించిన చిత్రం కావడం, ఇప్పటికే 'రంగస్థలం, భరత్ అనే నేను'లతో బాక్సాఫీస్ కళకళలాడుతూ ఉండటంతో నా పేరు సూర్య చిత్రంపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ చిత్రం ద్వారా రచయిత వక్కంతంవంశీ దర్శకునిగా పరిచయం అవుతున్నాడు. అను ఇమ్మాన్యుయేల్ నటించిన ఈ చిత్రంలో శరత్‌కుమార్, అర్జున్‌లు కూడా కీలక పాత్రను పోషించారు. ఇక ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్‌లో అల్లు అరవింద్ స్పీచ్‌కి బన్నీ బావోద్వేగానికి లోనయ్యాడు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ఇటీవల సినిమా పరిశ్రమ కుచించుకుపోయేలా, మనసుకు బాధ కలిగేలా, ఇండస్ట్రీలో ఉన్న అందరు ఎంతో కొంత బాధపడేలా కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సినీ పరిశ్రమలో చోటు చేసుకున్న పరిణామాల వల్ల కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. వాటి కారణంగా 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా'ను తప్పుదోవ పట్టించడానికి, మిక్స్‌డ్‌టాక్ వచ్చేలా చేయడానికి విమర్శించానికి కొందరు ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నాన్ని దాటే వారు ప్రేక్షకులు. సినిమా బాగుంటే అందరు చూస్తారు. ఒక నిజాయితి కలిగిన చిత్రం చేయాలని బన్నీ కొంతకాలంగా అనుకుంటూ ఉన్నాడు. ఈ కథను విని, మా దగ్గరకి వక్కంతం వంశీ వచ్చినప్పుడు ఆయన ఇంత గొప్పగా చిత్రం చేస్తాడని అసలు ఊహించలేదు.
బన్నీకి వంశీపై ఎంత నమ్మకం అంటే...ఆయన ఎప్పుడు దర్శకత్వం చేయలేదు కదా...! ఏదైనా చూసుకుంటూ చిత్రం తీస్తున్నాడా? అని ప్రశ్నిస్తే లేదు డాడీ.. అంతా స్ట్రయిట్ అని చెప్పాడు. అది దర్శకుడిపై ఉన్న నమ్మకం. సినిమా చూసినప్పుడు బన్నీ చెప్పింది నిజమేననిపించింది. దాసరి నారాయణరావుగారి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం విడుదల కావడం ఎంతో ఆనందంగా ఉంది. మిగిలింది సక్సెస్‌మీట్‌లో మాట్లాడుతానని చెప్పాడు. ఇక అల్లుఅరవింద్ మాటాడే సమయంలో బన్నీ కూడా ఎంతో ఉద్వేగానికి లోనవుతూ కనిపించాడు.