నాడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఎంతోకాలం దోబూచులాడి చివరకు అందరు అనుకున్న విధంగానే పార్టీని ప్రకటించాడు. ఇక ఈయన ఎన్టీఆర్ రికార్డును తిరగరాసి అతితక్కువ కాలంలో పార్టీని ఏర్పాటు చేసి, సీఎం అయిన ఘనత సాధించేందుకే పార్టీని ముందుగా ప్రకటించలేదు. అప్పుడు ప్రజారాజ్యం పార్టీ చేసిన సినిమా ట్రిక్స్‌నే ఇప్పుడు జనసేన చేస్తున్నట్లు అర్ధమవుతోంది. దేశంలోని ఏ రాజకీయ పార్టీ కూడా జనసేనలా తలా తోకా లేకుండా పెట్టలేదు. బహుశా పవన్‌కి కూడా తనకు తన అభిమానుల ఓట్లు, కులం ఓట్లు తప్పితే మిగతా ప్రజల ఓట్లు అవసరం లేదా? అనిపిస్తోంది. ప్రశించడానికే అయితే పవన్ కంటే మీడియానే బాగా ప్రశ్నించగలదు?
కానీ పవన్ ప్రశ్నించడానికే రాజకీయలలోకి వచ్చానని చెప్పాడు. కిందటి సార్వత్రిక ఎన్నికల సమయంలో జనసేన పార్టీని స్థాపిస్తే ఇప్పటికీ సంస్థాగత ఏర్పాట్లు, విధి విధానాలు, మేనిఫెస్టో కాదు కదా.. తాము వామపక్షాలతో కలిసి నడుస్తామా? లేక తెరవెనుక బిజెపికి మద్దతు ఇస్తారా? అనే దానిపై కూడా క్లారిటీ లేదు. ఇక ముందు మాత్రం పవన్ గద్దర్, కోదండరాం, లోక్‌సత్తా జయప్రకాష్‌నారాయణ, పద్మనాభయ్య, ఉండవల్లి అరుణ్‌కుమార్, సబ్బం హరి వంటి వారి మద్దతు తీసుకుని ముందుకెళ్తాడని ఆశపడ్డారు. కానీ ఒకే ఒరలో ఇన్ని కత్తులు ఇమడవని త్వరగానే తేలిపోయింది. చివరకు ప్రత్యేకహోదాపై కేంద్రం నుంచి వచ్చిన సాయం, వారు చెబుతున్న లెక్కలు, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వమైన టిడిపి చెబుతున్న లెక్కల్లో తేడాలను విచారించేందుకు ఓ కమిటీని వేశాడు. కానీ దీని ద్వారా ఆయన ఏం సాధించాడో తెలియని పరిస్థితి.
తాజాగా జనసేనకు చెందిన తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జ్ నేమూరి శంకర్ గౌడ్ మాత్రం రాబోయే ఎన్నికల్లో జనసేన తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాలలోనూ అన్ని స్థానాలలో పోటీ చేస్తామని ప్రకటించాడు. ఇంత ముఖ్యమైన విషయాన్ని ఈ పార్టీ మీడియా ద్వారా కాకుండా యూట్యూబ్ ద్వారా తెలిపింది. బహుశా పవన్‌కి మీడియా మీద కోపం వచ్చినందునే ఆయన మీడియా ద్వారా కాకుండా ఇలా స్పందించాడని అర్ధమవుతోంది. మీడియాపై అలగడం వల్ల జనసేనకి నష్టమే గానీ మీడియాకు కాదు. ఇక శంకర్‌గౌడ్ తెలుపుతూ, ఇప్పటికే నియోజకవర్గ కమిటీలు, భవిష్యత్తు కార్యాచరణపై పలు కమిటీలు రెండు రాష్ట్రాలలోనూ అందరినీ కలుస్తున్నాయని చెబుతున్నారు. ఈ విషయాన్ని కూడా ఇంత రహస్యంగా చేయడానికి కారణం ఏమిటో మాత్రం ఎవ్వరికీ అర్ధం కావడం లేదు.