బాలకృష్ణకి సినీ నటునిగా ఎంతో అనుభవం ఉంది. ఇక తన తండ్రి దర్శకత్వంలో వచ్చిన చిత్రాలలో కూడా ఆయన నటించాడు. దీనివల్ల, ఈ సుదీర్ఘ అనుభవం దృష్ట్యా ఆయనకు దర్శకత్వంపై కూడా మంచి అవగాహన ఉందని అందరు అంటూ ఉంటారు. ఇక బాలయ్య అప్పుడెప్పుడో తాను, సౌందర్య, శరత్‌బాబు, శ్రీహరి, ఉదయ్‌కిరణ్ వంటి వారితో 'నర్తనశాల' చిత్రాన్ని తన దర్శకత్వంలోనే మొదలు పెట్టాడు. కానీ ఆ చిత్రం ఓపెనింగ్ జరిగి అన్నపూర్ణ ఏడెకరాలలో కొంత షూటింగ్ జరిగిన తర్వాత ద్రౌపది పాత్రధారి సౌందర్య ఆకస్మికంగా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో ఆగిపోయింది. అసలే సెంటిమెంట్లు ఎక్కువగా పాటించే బాలయ్య శకునం బాగా లేదని ఏకంగా జ్యోతిష్కుల మాట ప్రకారం సినిమానే పక్కన పెట్టేశాడు.
ఇక తాజాగా బాలకృష్ణ నిర్మాతగా మారి తన తండ్రి బయోపిక్ 'ఎన్టీఆర్' చిత్రాన్ని తేజ దర్శకత్వంలో చేయాలని భావించాడు. ఈ చిత్రం షూటింగ్ ముహూర్తం, స్క్రిప్ట్ అన్ని పూర్తి అయిన దశలో తేజ ఈ చిత్రానికి తాను న్యాయం చేయలేనని ఓపెన్‌గా చెప్పి చర్చకు ఫుల్‌స్టాప్ పెట్టాడు. ఇక ఈ చిత్రం విషయంలో కె.రాఘవేంద్రరావు, సింగీతం శ్రీనివాసరావు, వైవిఎస్‌చౌదరి, క్రిష్, పూరీ జగన్నాథ్, కృష్ణవంశీ వంటి పలువురి పేర్లు వినిపించాయి. తాజాగా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని బాలయ్య తానే దర్శకత్వం వహించనున్నాడని తెలుస్తోంది.
మరి ఈ చిత్రానికి దర్శకత్వ పర్యవేక్షకునిగా రాఘవేంద్రరావు, లేదా సింగీతం శ్రీనివాసరావులలో ఒకరిని తీసుకుని, దర్శకత్వ బాధ్యతలను బాలయ్యే తీసుకోనున్నాడని సమాచారం. బాలయ్య కంటే ఆయన తండ్రిని దగ్గరగా చూసిన వారు అరుదు. మరి ఈ చిత్రానికి బాలయ్యే దర్శకత్వం వహిస్తే అరంగేట్రంతోనే పెద్ద బాధ్యతలను బాలయ్య మోస్తున్నట్లేనని చెప్పవచ్చు.