'భరత్ అనే నేను' సినిమాకి మూల కథ అందించింది శ్రీహరి నాను అని అందరికి తెలిసిన విషయమే. ఇతను డైరెక్టర్ కొరటాల శివకి ఫ్రెండ్. అతను చెప్పిన లైన్ నచ్చడంతో కొరటాల అతని దగ్గర నుండి ఆ లైన్ తీసుకుని మహేష్ బాబుకు తగ్గట్టు స్క్రిప్ట్ డెవెలప్ చేసాడు. శ్రీహరి నాను అనే వ్యక్తి రెండు మూడు సినిమాలు దర్శకత్వం కూడా చేశాడు.
భూమిక హీరోయిన్ గా ‘సత్యభామ’ అనే సినిమా రూపొందించిన దర్శకుడు ఇతనే. ఆ సినిమా అంతగా ఆడలేదు. కానీ శ్రీహరి పనితీరు నచ్చి అతడి దర్శకత్వంలో భూమిక ‘తకిట తకిట’ అనే సినిమా కూడా నిర్మించింది. అది కూడా అంతగా ఆడలేదు. ఆ తర్వాత అతను కొన్ని సినిమాలకి రైటర్ గా పని చేసాడు. అయితే పెద్దగా గుర్తింపు రాలేదు. మళ్లీ ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత అతడి పేరు వార్తల్లోకి వచ్చింది. నిన్న జరిగిన భరత్ అనే నేను సక్సెస్ సెలెబ్రేషన్స్ లో డైరెక్టర్ కొరటాల మాట్లాడుతూ...తెలుగు పరిశ్రమలో ఉన్న అత్యుత్తమ రచయితల్లో శ్రీహరి నాను ఒకడని కొరటాల కితాబిచ్చాడు.
అతను ఏ కథ రాసుకున్న మహేష్ బాబుని ద్రుష్టిలో పెట్టుకునే కథ రాస్తాడని... అలాంటి గొప్ప నటుడి కోసం కథ అంటే ఇన్‌స్పిరేషన్ వచ్చి మరింత బాగా రాస్తానని అతడి నమ్మకమని కొరటాల చెప్పాడు. శ్రీహరితో కలిసి పని చేయటం చాలా ఆనందంగా ఉందని... మా ఇద్దరి కాంబినేషన్లో మున్ముందు మరిన్ని మంచి కథలు వస్తాయని ఆశిస్తున్నానని చెప్పాడు కొరటాల.