ప్రస్తుతం బయోపిక్‌ల హవా నడుస్తోంది. బాలీవుడ్‌లో చాలా కాలం నుంచి ఉంటే టాలీవుడ్‌లో అది ఇప్పుడిప్పుడే వేగం పెంచుకుంటోంది. ఎన్టీఆర్ బయోపిక్ రూపొందుతున్న సమయంలోనే జననేతగా పేరు తెచ్చుకున్న సమైక్యాంధ్రమాజీ సీఎం, స్వర్గీయ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బయోపిక్‌ని 'ఆనందోబ్రహ్మ' దర్శకుడు మహి. వి.రాఘవ మొదలు పెట్టాడు. మొదట్లో అందరు దీనిని లైట్‌గా తీసుకున్నారు. ఎందుకంటే ఫేడవుట్ అయిన వినోద్‌కుమార్ నటించిన వైఎస్ బయోపిక్ ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా ఎవ్వరికీ తెలియదు. ఇక మహి.వి.రాఘవ కూడా కేవలం 'ఆనందోబ్రహ్మ' వంటి చిన్నచిత్రం దర్శకునిగా హిట్ కొట్టాడు అంతే తప్ప ఆయనకంటే ఏ క్రేజ్ లేదు.
కానీ ఎప్పుడైతే ఆయన మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టిని ఆ పాత్రకు ఎంచుకుని ఒప్పించాడో దాంతో ఈ చిత్రం క్రేజ్ బాగా పెరిగింది. ఇక వైఎస్ తరహాలో జనాలకు అభివాదం చేస్తూ, ఆయన కట్టిన పంచెకట్టు తరహాలోనే మమ్ముట్టి ఉన్న తీరు, ఈ చిత్రానికి 'యాత్ర' అనే టైటిల్ పెట్టడం, టైటిల్ లోగోలు కూడా విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రంలో వైఎస్ శ్రీమతి విజయమ్మ పాత్రకి కూడా నయనతార, రాధికా ఆప్టే, తమన్నా వంటి పేర్లు వినిపించించాయి. అయితే దర్శకుడు మాత్రం అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నాడు.
ఈ పాత్రకుగాను ఆయన ఓ డ్యాన్సర్‌ని ఎంపిక చేశాడు. ఆమె ఎవరో కాదు.. 'బాహుబలి' చిత్రంలో 'కన్నా నిదురించరా' అనే పాటలో అనుష్కతో కలిసి నటించి, అనుష్క వదిన పాత్రను చేసిన ఆశ్రిత వేముగంటి. భరత నాట్యం, కూచిపూడిలలో ప్రవేశం ఉన్న ఆమె పెద్దగా చిత్రాలలో నటించనని చెప్పింది. మరి ఆమెను ఈ వైఎస్ బయోపిక్ 'యాత్ర'లో విజయమ్మ పాత్రకి ఎంపిక చేయడం, దానికి ఆమె ఒప్పుకోవడం కూడా అనూహ్యమే. ఇక ఈమె విజయమ్మగా నటిస్తుందని తెలిసినా ఈమె ద్వారా ఈ చిత్రానికి పెద్దగా క్రేజ్ వచ్చే అవకాశం లేదనే చెప్పాలి.