కిందటి ఏడాది ఏప్రిల్ 27న దేశం మొత్తం ఒక సినిమా మేనియాలో ఉర్రూతలూగింది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అనే ప్రశ్నకు ఆరోజే సమాధానం వచ్చింది. బాహుబలిని కటప్ప ఎందుకు చంపాడో? అందరికీ తెలిసింది. దేశంలోని ప్రింటు, ఎలక్ట్రానిక్, వెబ్, ఇలా అన్నిరకాల మీడియాలో ఆ ఉద్వేగంలో ఉండి పోయాయి. జనాలు ఈ చిత్రం చూసేందుకు పోటెత్తారు. భారతీయ సినీ చరిత్రలోనే ఇంతలా క్రేజ్ సాధించిన చిత్రం అప్పటివరకు మరోటి లేదు. అదే తొలిసారి అని చెప్పడం అతిశయం కాదు. ఆనాడు 'బాహుబలి-ది కన్‌క్లూజన్' చిత్రం విషయంలో దేశ విదేశాలలో కూడా ఈ చిత్రం ఓ అద్భుతమైన శకానికి నాంది పలికింది. వందేళ్లు దాటిన భారతీయ సినీ చరిత్రలో అది మరపురాని, మరిచిపోలేని రోజుగా మిగిలింది. ఇక ఈ చిత్రం కలెక్షన్ల విషయంలోనే కాదు... అన్ని విషయాలలోనూ తన హవా సాగించింది. యూట్యూబ్‌లు, ఫేస్‌బుక్‌లు, ట్విట్టర్స్ మార్మోగిపోయాయి.
నాటి రోజు రెబెల్‌స్టార్‌గా తెలుగు తెరకు పరిచయమై 'బాహుబలి-ది బిగినింగ్'తో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ప్రభాస్ ఈ చిత్రంతో నేషనల్, ఇంటర్నేషనల్ ఐకాన్‌గా మారాడు. ఖచ్చితంగా ఈ ఏడాది అదే తేదీన ప్రభాస్ నటిస్తున్న తదుపరి చిత్రం 'సాహో' షూటింగ్ భారీఎత్తున అబుదాబిలో షూటింగ్ జరుపుకుంటోంది. కీలకమైన యాక్షన్ సీన్స్‌ని అక్కడ ప్రభాస్ తదితరులపై చిత్రీకరిస్తున్నారు.
ఇక దీనిపై ప్రభాస్ స్పందిస్తూ.. ఈ ఘటన గుర్తుకు వచ్చి నేను అనిర్వచనీయమైన అనుభూతికి లోనయ్యాను. ఈ చిత్రం సంచలన విజయం సాధించిన నా కెరీర్‌లో చెప్పుకోదగినదిగా నిలిచిపోయింది. ప్రపంచవ్యాప్తంగా నాకు అభిమానులను సంపాదించి పెట్టడమే కాదు.. మేడమ్ టూస్సాడ్స్‌లో నా మైనపు విగ్రహాన్ని ఏర్పాటయ్యేలా చేసింది. అలాంటి 'బాహుబలి' నాకు ఎప్పటికీ ఎంతో ప్రత్యేకమైనదే. నాకు ఇంతటి కీర్తిప్రతిష్టలు తెచ్చి పెట్టిన రాజమౌళి గారికి, అందుకు సహకరించిన నా మిత్రులకు కృతజ్ఞతలు.. అంటూ ప్రభాస్ తెలిపాడు. నిజమే.. ఎన్నితరాలు మారినా ఈ చిత్రం ప్రభాస్‌కే కాదు... ఇండియన్ సినిమాకి, మరీ ముఖ్యంగా టాలీవుడ్‌కి తీపి గుర్తుగా మిగిలిపోతుంది.