'ఈగ' ముందు వరకు కేవలం టాలీవుడ్‌లోనే అపజయం ఎరుగని దర్శకునిగా దర్శకధీరుడు రాజమౌళి పేరు వినిపించేది. కానీ 'ఈగ' చిత్రంతో ఆయన తన చిత్రాలను నాలుగైదు భాషల్లో రిలీజ్ అయ్యేలా మైండ్‌సెట్ మార్చుకున్నాడు. ఇక 'ఈగ' చిత్రంలో సమంత, నానిల కంటే ఓ ఆకు ఎక్కువగానే కన్నడ స్టార్ కిచ్చా సుదీప్‌కి విపరీమైన పేరు వచ్చింది. ఈయన పోషించిన ఈ నెగటివ్ పాత్ర ఈ చిత్రానికి హైలైట్‌గా నిలబడింది. ఆ తర్వాత కూడా ఆయన 'బాహుబలి'లో చిన్న పాత్రను చేశాడు.
కన్నడలో స్టార్‌గా ఉన్నఆయన ఇమేజ్‌ని వాడుకోవడం కోసం చిరంజీవి నటిస్తున్న 151వ ప్రతిష్టాత్మక చిత్రంగా రూపొందుతూ, రామ్‌చరణ్ నిర్మాతగా కొణిదెల బేనర్‌లో రూపొందుతున్న 'సై..రా..నరసింహారెడ్డి' చిత్రంలో కూడా ఓ ప్రధానమైన పాత్రను పోషిస్తున్నాడు. ఇక తాజాగా రామ్‌చరణ్ హీరోగా దానయ్య నిర్మాతగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. దీనిని 'భరత్ అనే నేను' చిత్రాన్ని నిర్మించిన దానయ్యే నిర్మిస్తుండగా, హీరోయిన్‌గా కూడా భరత్ హీరోయిన్ కైరా అద్వానీనే హీరోయిన్‌గా నటించనుంది. ఇక బోయపాటి శ్రీను చిత్రాలలో విలన్లు ఎలా పవర్‌ఫుల్‌గా ఉంటారో, ప్రత్యేక పాత్రలను పోషించే వారు అంతకంటే కీలకంగా ఉంటారు.
ఇక ఇందులో రామ్‌చరణ్ ముగ్గురు అన్నలు, వదినల ముద్దుల మరిది, తమ్ముడిగా నటిస్తున్నాడు. ఆయన అన్నయ్యలుగా తమిళ హీరో ప్రశాంత్, నవీన్‌చంద్ర, స్నేహ వంటి వారితో పాటు వివేక్‌ఒబేరాయ్ విలన్‌గా పవర్‌ఫుల్ పాత్రను చేస్తున్నాడు. ఇక ఈచిత్రంలో మరో కీలకమైన పాత్రను కిచ్చా సుదీప్ చేత చేయించాలని బోయపాటి భావించి, ఆయనను కలిసి స్టోరీ చెప్పడం, సుదీప్ కూడా ఓకే చెప్పడం జరిగిందని సమాచారం. ఇక తమిళ ప్రేక్షకులను మెప్పించేందుకు ప్రశాంత్, స్నేహ, బాలీవుడ్ నుంచి వివేక్ ఒబేరాయ్, కన్నడ నుంచి సుదీప్‌ల రాకతో ఈ చిత్రానికి మరింత బలం యాడ్ అయిందనే చెప్పాలి.