ప్రస్తుతం దేశం మొత్తం చూపు కర్ణాటకపై ఉంది. కర్ణాటకలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు రాబోయే సార్వత్రిక ఎన్నికలకు రిఫరెండమ్‌గా, సెమీఫైనల్స్‌గా నిలవనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడులో బిజెపి పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. అయితే దక్షిణాదిలో బిజెపి పట్టున్న ఒకే ఒక్క రాష్ట్రం కర్ణాటకయే. కానీ కేంద్ర ప్రభుత్వం, మోదీ తీసుకుంటున్న బ్యాంకులను దివాలా తీయించే పనులు, మాటలు మారుస్తున్న ధోరణి, ఏపీకి ప్రత్యేకహోదా వంటి వాటి విషయంలో మోసపూరితంగా వ్యవహరించడం, పెద్ద నోట్ల తర్వాత కరెన్సీకి ఏర్పడిన ఇక్కట్లు, బ్యాంకులలో డిపాజిట్లు కూడా భారీగా పడిపోవడం, బ్యాంక్ కుంభకోణాలు వంటి పలు విషయాలపై మోదీపై వ్యతిరేకత ఉంది.
ఇక మోదీ-అమిత్‌షాలు ఎవరిని పట్టించుకోవడం లేదని, కేంద్రంలోని అందరు మంత్రులు వీరి చేతిలో కీలు బొమ్మలుగా మారారని, అద్వానీ, మురళీమనోహర్ జోషి, బిజెపి నుంచి బయటికి వచ్చిన యశ్వంత్‌సిన్హాలతోపాటు పలువురు బిజెపి సీనియర్లు కూడా మోదీ, అమిత్‌షాల వ్యవహారశైలిపై ఆగ్రహంగా ఉన్నారు. ఇక ఎన్డీఏలోని మిత్రపక్షాలను తమకు పూర్తి మెజార్టీ ఉండటంతో మోదీ-షాలు వారిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మరోవైపు ప్రాంతీయ పార్టీలను అణిచివేసి కేవలం జాతీయ పార్టీలను అందులోనూ కేవలం బిజెపి, కాంగ్రెస్‌లే ఉండేట్లు మోదీ చర్యలు ఉన్నాయి. దాంతో ప్రాంతీయ పార్టీలేవీ మోదీని నమ్మేస్థితిలో లేవు. చంద్రబాబు టిడిపి, శివసేన వంటి వారు కూడా ఎన్డీఏ నుంచి వైదొలిగారు. కానీ మోడీ, అమిత్‌షాలు మాత్రం తమకు పట్టులేని రాష్ట్రాలను ఇబ్బందులు పెట్టినట్లు తమకు పట్టున్న రాష్ట్రాలలో మాత్రం తమపై వ్యతిరేకత లేకుండా చూసుకుంటూ తమ వ్యతిరేక రాష్ట్రాల సౌకర్యాలను కూడా తమ పట్టు ఉన్న ప్రాంతాలకు మరలిస్తున్నారనే ఆరోపణ కూడా ఉంది.
ఇక కర్ణాటకలో మరీ ముఖ్యంగా ఉత్తర కర్ణాటకలో తెలుగు వారికి మంచి పట్టుంది. తెలంగాణకు చెందిన మహబూబ్ నగర్, హైదరాబాద్, ఏపీలోని అనంతపురం, కర్నూల్ జిల్లాల ప్రజలు ఈ ప్రాంతాలలో ఎక్కువగా నివసిస్తున్నారు. ఇక తాజాగా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు కర్ణాటకలో ఒకే సంఖ్యలో సీట్లు వస్తాయని, అధికారంలోకి ఎవరు రావాలన్నా కూడా జెడిఎస్ మద్దతు తప్పనిసరిగా మారే అవకాశం ఉంది. ప్రకాష్‌రాజ్ మాట్లాడుతూ, దేవగౌడ ఎట్టి పరిస్థితుల్లోనూ బిజెపికి మద్దతు ఇవ్వమని చెప్పారని అంటున్నాడు. కానీ జెడిఎస్ వాలకం చూస్తే వారు ఎన్నికల తర్వాత బిజెపితోనే జతకట్టేలా పరిస్థితి ఉంది.
ఇక ఇప్పుడు ఈ తెలుగువారు బాగా ప్రభావితం చూపించే ఉత్తర కర్ణాటక రాష్ట్రాలలో జనసేనాధిపతి పవన్‌కళ్యాణ్ జెడిఎస్ తరపున ప్రచారం చేయనున్నాడట. ఈ ప్రాంతంలో పవన్ చరిష్మాతో కనీసం 18 స్థానాలైన గెలుపొందాలని జెడిఎస్ భావిస్తోంది. ఇక జెడిఎస్ తరపున ఇప్పటికే పూజాగాంధీ, జాగ్వార్ హీరో నిఖిల్‌లు ప్రచారం చేయనున్నారు. మరి జెడిఎస్ బిజెపికి మద్దతు ఇచ్చేపరిస్థితిలో ఆ పార్టీకి అనుకూలంగా పవన్ ఎన్నికల ప్రచారం చేయడం ఏపీని మోసం చేసిన బిజెపికే ప్లస్‌పాయింట్ అవుతుంది. ఇదే జరిగితే మాత్రం ఏపీలో పవన్‌పై తీవ్ర వ్యతిరేకత రావడం ఖాయం. ఇక కాంగ్రెస్ తరపున చిరంజీవి ప్రచారం చేస్తాడా? లేదా? అనేది కూడా వేచిచూడాల్సివుంది!