యువత నుంచి రిషికపూర్ వంటి సీనియర్ లెజెండ్ వరకు అందరి చేత సెహభాష్ అనిపించుకున్న నటి ప్రియా ప్రకాష్ వారియర్. 'ఒరు ఆధార్ లవ్' చిత్రంలోని ఓ పాటలో కేవలం తన కన్నుగీటుతోనే ఈమె మీడియాలో పాపులర్ అయింది. ఇక సోషల్ మీడియాలో అయితే ఆమె ఓ సంచలనం. 2018లో ఇప్పటివరకు ఈమె హవాని దాటే వారే కనిపించడం లేదు. ఇంకా ఒక్క సినిమా విడుదల కాకముందే క్రేజ్, ఇమేజ్, సంపాదన విషయంలో కూడా ఈమె స్టార్స్‌కి ఏమాత్రం తీసిపోని పాపులారిటీ సాధించింది. ఇక సిద్దార్ద్ నుంచి బన్నీ వరకు ఈమె చూపును చూసి మైమరిచిపోయినవారే.
ఇక ఈమెకు క్రేజ్ తెచ్చుకోవడం ఎలాగో తెలిసింది. మరి ఈ క్రేజ్, ఇమేజ్‌ని ఆమె నిలబెట్టుకుంటుందా? లేదా? అనేది వెయిట్ చేయాల్సివుంది. ఈమె సంపాదన, ఈమెకి వెల్లువెత్తుతున్న ఆఫర్లు, కేవలం మాలీవుడ్‌కే కాకుండా ఏకంగా దేశం మొత్తంలోని అన్ని భాషల్లో ఆమె తనకంటూ ఓ క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఈ ఒక్క కన్నుగీటుతో మెప్పించిన ఆమెను తమ చిత్రాలలో నటింపజేయాలని పలు భాషా ఫిల్మ్‌మేకర్స్ క్యూ కడుతున్నారు. ఆమె ఎంత డిమాండ్ చేసినా ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. ఇక ఈ వీడియో బయటకు రాని వరకు 'ఒరు ఆధార్ లవ్' చిత్రంలో ఈమెది సెకండ్ హీరోయిన్‌గా చిన్న పాత్రే. కానీ ఈమెకి వచ్చిన క్రేజ్‌ని సద్వినియోగం చేసుకోవడం కోసం, ఇతర భాషల్లో కూడా ఈమెకి ఉన్న క్రేజ్‌ను వాడుకుని డబ్బింగ్ చేయడం కోసం ఆమె పాత్రని మరింతగా నిడివి పెంచిమరీ సినిమాని రీషూట్ చేస్తున్నారు.
ఇక ఈ చిత్రం జూన్‌లో విడుదలైన తర్వాత మాత్రమే ఆమె తదుపరి చిత్రాలకు ఓకే చెప్పనుంది. ఇక తాజాగా ఈమెకి ఓ అవార్డు కూడా వచ్చింది. మొదటి సినిమా విడుదల కాకుండానే ఓ అవార్డు అందుకోవడం అంటే అది చిన్నవిషయం కాదు. 2018 సంవత్సరానికి గాను ఆమె 'వైరల్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్' అవార్డుని అందుకుంది. తాను జీవితంలో అందుకున్న తొలి అవార్డు ఇదేనని దానికి తనకెంతో ఆనందంగా ఉందని ప్రియా వారియర్ తెలిపింది. మొత్తానికి ఈమె సెన్సేషన్‌కి తోడు అవార్డులు కూడా తోడుకావడంతో ఆమె ఆనందానికి అవధులు లేవు.