రజనీకాంత్ అంటే ఆయన స్టైల్‌కే స్టైల్‌ని నేర్పించే వ్యక్తిగా అభిమానులు చెప్పుకుంటారు. ప్రస్తుతం మనదేశంలోనే స్టైల్‌కి అర్ధం చెప్పిన వ్యక్తి రజనీ. ఇక ఈయన తాజాగా రాజకీయాలలోకి కూడా ఎంట్రీ ఇస్తూ ఉండటంతో హిమాలయాలకు వెళ్లాడు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆయన హిమాలయాలకు వెళ్లి అక్కడి సాధువులను,యోగులను తన గురువులను దర్శించి వస్తూ ఉంటాడు. అక్కడ ఆయన ఈమధ్య ఓ ఆశ్రమం కూడా కట్టించాడు. ఇక ఈమధ్య రజనీ తరచుగా అమెరికాకి వెళ్తున్నాడు. వయసు రీత్యా వచ్చే ఆరోగ్య సమస్యల చెకప్ కోసమే ఆయన ఇలా అమెరికా వెళ్తుంటాడు.
అయినా రజనీ అమెరికన్ ట్రిప్ వెనుక రెండు ముఖ్యోద్దేశాలు ఉన్నాయి. ఈయన గత కొంతకాలంగా వేసవిలోనే అమెరికా వెళ్తున్నాడు. దీనివల్ల ఎండ వేడిమి నుంచి తప్పించుకోవడంతో పాటు అక్కడి చల్లని ప్రదేశాలలోకూడా ఎంజాయ్ చేయడం అనేది కూడా ఓ బలమైన కారణం. ఇక తాజాగా రజనీ అమెరికాకు వెళ్లనున్నాడని పలు వార్తలు వస్తున్నాయి. వాటిని కొందరు ఖండించినా ఆయన ఆల్‌రెడీ అమెరికాలో వాలిపోయాడు. అక్కడి ఎయిర్‌పోర్ట్‌లో ఆయన కొందరికంటికి దొరికాడు. టీషర్ట్‌లో రజనీ ఎంతో స్టైలిష్‌గా ఉన్నాడు. పైగా బ్లాక్ కలర్ టీషర్ట్ కావడంతో మరింత స్టైల్ వచ్చింది. ఏమాత్రం ప్రత్యేకంగా లేకుండా ఓ టీషర్ట్, షూస్, గడ్డం, బట్టతలతో కనిపించినా కూడా ఆయన స్టైల్‌ని చూస్తే రజనీని చూసి ప్రేక్షకులు ఎందుకు అంతగా ఆయన్ను అనుసరిస్తారని అనిపించడం మాత్రం ఖాయం.
ఇక ఈయన నటించిన 'కాలా' చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని జూన్7 న విడుదల కానుంది. ఈ చిత్రం ఆల్‌రెడీ ఏప్రిల్ 27న రిలీజ్ కావాల్సిన ఉన్నా కూడా తమిళనాట సమ్మె కారణంగా ఇది వాయిదా పడింది. ఇక ఎప్పటినుంచో షూటింగ్, గ్రాఫిక్స్, విఎఫ్‌ఎక్స్‌లు జరుపుకుంటున్న '2.0' చిత్రాన్ని కూడా ఈ ఏడాది చివరల్లో గానీ లేదా సంక్రాంతి సీజన్‌లో పొంగల్ కానుకగా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.