2017 సివిల్స్ టాపర్‌గా దూరిశెట్టి అనుదీప్ నిలిచాడు. ఈయన తెలంగాణ రాష్ట్రానికి చెందిన మేట్‌పల్లి వాసి. ఓ తెలుగుతేజం ఇలాంటి గొప్పస్థానం పొందడం నిజంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ గర్వకారణంగా చెప్పాలి. యూనియన్ పబ్లిక్ సర్వీస్‌కమిషన్ సివిల్‌సర్వీసెస్ పరీక్షల్లో 2017 సంవత్సరానికి గాను ఈయన ప్రధమ స్థానంలో నిలిచాడు. ఈపరీక్షల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన తెలుగు తేజాలు మంచి ర్యాంకులను కైవసం చేసుకున్నారు.
నీలం సాయితేజ 43 వ ర్యాంకు, నారపురెడ్డి మౌర్య 100వ ర్యాంకు, జి.మాధురికి 144వ ర్యాంకు, వివేక్ జాన్సర్ 195వ ర్యాంకులు సాధించారు. సిబిఐ మాజీ జెడీ లక్ష్మీనారాయణ కుమారుడు సాయిప్రణీత్ 196వ స్థానం సాధించాడు. ఇక మొత్తంగా 990మంది ఈ పోస్ట్‌లకు ఎంపికయ్యారు. మొదటిర్యాంకర్ అయిన అనుదీప్ పదోతరగతి వరకు శ్రీ సర్వోదయ హైస్కూల్‌లో, ఇంటర్ శ్రీ చైతన్యకాలేజీలో, బిట్స్‌పిలాని రాజస్థాన్ నుంచి బిఈ అందుకున్నాడు. తండ్రి మనోహర్ ప్రభుత్వ ఉద్యోగి. తల్లి జ్యోతి గృహిణి. మొదటి స్థానం పొందిన అనుదీప్‌కి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, సీఎం కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్‌లు శుభాకాంక్షలు తెలిపారు. అనుదీప్ తెలంగాణకు, జగిత్యాలకు గర్వకారణంగా వారు పేర్కొన్నారు.
ఇక అనుదీప్‌కి జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ కూడా శుభాకాంక్షలు తెలిపాడు. సివిల్స్‌లో టాప్ ర్యాంక్ వచ్చిన నిన్ను చూసి గర్విస్తున్నామని, ఈ సందర్భంగా అనుదీప్ తల్లిదండ్రులు, బంధువులు, ఉపాధ్యాయులు, సన్నిహితులకు ఆయన అభినందనలు తెలిపాడు. ఇక మాజీ జేడీ లక్ష్మీనారాయణ కుమారుడు కూడా ఈ పోటీ పరీక్షల్లో రాణించి, తన సత్తా చాటడం నిజంగా గర్వంచదగ్గ విషయం.