నేడు దర్శకులు కూడా తమకి ఏదైనా కథ నచ్చి, తాము చేయబోయే చిత్రం కాకపోయినా కథ నచ్చితే నిర్మాతలుగా మారి సినిమాలను నిర్మిస్తున్నారు. ఇప్పటికే రాజమౌళి, పూరీజగన్నాథ్, సుకుమార్, హరీష్‌శంకర్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌లతో పాటు హీరో నాని కూడా తాజాగా 'అ!' అనే ప్రయోగాత్మక చిత్రం చేసి పూర్తి స్థాయి నిర్మాతగా మారాడు. ఇక తాజాగా ఇదే దోవలోకి కొరటాల శివ కూడా వస్తున్నాడు. ఇప్పటివరకు కొరటాల శివ దర్శకునిగా తీసిన చిత్రాలు నాలుగే. 'మిర్చి, శ్రీమంతుడు, జనతాగ్యారేజ్' తాజాగా 'భరత్ అనే నేను'. ఈ నాలుగు చిత్రాలు బ్లాక్‌బస్టర్సే. అందునా తాను ఏ హీరోతో చేస్తే వారికి ఇండస్ట్రీలో కెరీర్ బెస్ట్ మూవీలను కొరటాలశివ అందిస్తున్నాడు.
ఇక ప్రస్తుతం రాజమౌళి తర్వాత స్థానం దర్శకునిగా కొరటాల శివదే. ఈయన కూడా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఎవరైనా మంచి కథలు, ప్రయోగాత్మక కథలతో నా వద్దకు వస్తే కథలో సహకారం కూడా అందించి, తానే నిర్మాతగా ఆ చిత్రాలు చేయడానికి రెడీ అని చెప్పాడు. ఇక కొరటాల శివ జడ్జిమెంట్ అంటే ఇప్పటికే అందరిలో ఓ క్లారిటీ, నమ్మకం వచ్చేశాయి. ఇక ఈయనకు మంచి కథలను తీసుకుని వెళ్లి ఒప్పించుకోవలసిన బాధ్యత యువ రచయితలు, కొత్త తరం దర్శకులదే అని చెప్పవచ్చు.
మరి కొరటాల పేరు వినిపిస్తేనే కావాల్సినంత పబ్లిసిటీ, డబ్బులు పెట్టే క్రేజీ నిర్మాతలు సులభంగా ముందుకు వస్తారు. మరి నిర్మాతగా కూడా కొరటాల శివ తన మార్కుని చూపిస్తాడని ఖచ్చితంగా చెప్పవచ్చు.