తెలుగులో హృద్యమైన పాట రాయాలన్నా, శరీరాన్ని సలసల మండేలా విప్లవగీతాలు రాయాలన్నా కూడా సుద్దాల అశోక్‌తేజ పేరు బాగా వినిపిస్తుంది. ఈయన కెరీర్‌కి వచ్చిన మొదట్లో అనుకోకుండా అన్ని విప్లవగీతాలే రాశాడు. 'ఒసేయ్..రాములమ్మ'లో ఆయన పాటలు ఎంతగా పాపులర్ అయ్యాయో తెలిసిందే. ఇక సుద్దాల అశోక్‌తేజ తాజాగా మాట్లాడుతూ, నేను వరుసగా విప్లవగీతాలు రాస్తున్న సమయంలో మోహన్‌బాబు గారు ఫోన్ చేసి, అన్ని పాటలు అవే రాశావంటే ఇబ్బంది. అన్ని రకాల పాటలు రాయమని సలహా ఇచ్చారు. నేను చాన్స్ ఇస్తే అన్ని రకాల పాటలు రాయగలను సార్ అని చెప్పాను. నేను అవకాశం ఇస్తానని పిలిచి నాచేత పక్కా కమర్షియల్ పాటలు కూడా రాయించారు. అలా ఆయన సినిమాలకు వరుసగా పాటలు రాశాను. ఇక ఆ సమయంలో నాకు బైక్ మీద నుంచి పడి గాయాలయ్యాయి. అప్పటికి మోహన్‌బాబు చిత్రానికి ఇంకా పాటలు కూడా రాయలేదు. ఆయన తన మేనేజర్‌ని పిలిచి నాకు 25వేలు ఇవ్వమన్నారు. ఆ మేనేజర్ ఆయన ఇంకా ఆ పాటను ఆయన రాయలేదని చెప్పినా.. ఫర్వాలేదు. మన ఆస్థాన కవిని గౌరవించాలి... అని ఆ డబ్బును నాకు పంపారు. అలా పాట అనే నా దీపాన్ని ఆర్పకుండా మోహన్‌బాబుగారు చేశారు.
ఇక సుద్దాల పాటలలో ఆవేశం కనిపిస్తుంది.. ఆలోచన రేకెత్తిస్తుంది.. జానపదం వినిపిస్తుంది. ఇక ఈయన తనకి శ్రీశ్రీ మహా ఇష్టమని ఎన్నోసార్లు చెప్పారు. ఇక ఈయన శ్రీశ్రీ రాసిన మహాప్రస్దానంలోని 'నేను సైతం' అనే పాటను కూడా 'ఠాగూర్' చిత్రం కోసం రాశారు. 'ఠాగూర్'లో పాట రాయించాలని డిసైడ్ అయిన తర్వాత చిరంజీవి గారు నన్ను పిలిపించారు. 'నేను సైతం' అని నేను 'రుద్రవీణ' కోసం ఓ పాట రాయించుకున్నాను. మరలా ఈ సినిమాలో అదే 'నేను సైతం' పదాలను వాడుతూ పాటని పెట్టాలని అనుకుంటున్నాను. 'నేను సైతం.. ' అని పల్లవిలో వాడుకుని మిగిలినదంతా ఎంతో ఉద్వేగంగా చరణాలు వాటికి మించి ఉండాలి అని చెప్పారు. దాంతో శ్రీశ్రీ బతికి ఉంటే ఎలా రాసేవాడో తనని తాను ఆలోచించుకున్నాడట సుద్దాల, అలా శ్రీశ్రీని ఆవాహనం చేసుకుని ఆ పాటను 10, 12 నిమిషాలలో రాసి ఇచ్చాడంట. ఒక్క అక్షరం కూడా మారకుండా ఆ పాట ఓకే అయింది. ఆ పాట వినిపించినప్పుడు చిరంజీవి గారు 'చూడు అశోక్.. రోమాలు ఎలా నిక్కబొడుచుకుంటున్నాయో.....అద్భుతంగా రాశావు' అని కౌగిలించుకున్నారు. ఆయన అద్భుతంగా రాసావని అనడమే నాకు నేషనల్ అవార్డు. ఆ తర్వాత నిజంగానే ఆ పాటకు జాతీయ అవార్డు వచ్చింది అని చెప్పుకొచ్చాడు.