ఈసారి జరగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మాత్రం దేశం గమ్యాన్ని, భవిష్యత్తుని దిశా నిర్దేశం చేసే కీలకమైనపాత్రను పోషించే ఎన్నికలుగా అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఒకవైపు ప్రకాష్‌రాజ్ వంటి వారు మోదీని చీల్చిచెండాడుతున్నారు. మరోవైపు గాలి జనార్దన్‌రెడ్డి సహాయంతో ఆయన స్నేహితులందరికీ బిజెపి తరపున టిక్కెట్లు ఇచ్చారు. ఇక ఈ ఎన్నికల ద్వారా మోదీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందా? లేక ఇంకా సానుకూలంగానే పరిస్థితులు ఉన్నాయా? అనేది తేలనుంది. దక్షిణాదిలోని ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళల వల్లే కర్ణాటకలో కూడా పరిస్థితులు మోడీకి వ్యతిరేకంగా ఉన్నాయా? లేదా? అనేది తేలనుంది.
ఇక కర్ణాటక ఎన్నికలలో అంబరీష్ ఆరోగ్య సమస్యల వల్ల పోటీ చేయడం లేదు. ఇక తెలుగు నటుడు, డైలాగ్‌కింగ్‌గా పేరుండి.... కర్ణాటకలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న సాయికుమార్ కర్ణాటక ఎన్నికల్లో బిజెపి తరపున చిక్కుబళాపూర్ జిల్లా బాగేపల్లి నియోజక వర్గం నుంచి బిజెపి తరపున ఎమ్మెల్యేగా పోటీచేస్తున్నాడు. ఈ ప్రాంతంలో తెలుగు వారు ఎక్కువగా ఉండటం, బ్రాహ్మణుల ఓట్లు కూడా కీలకం కావడంతో బిజెపి ఆయనకు సీటు ఇచ్చింది. కానీ తెలుగు వారు కర్ణాటకలో అయినా సరే అందునా బిజెపి అభ్యర్ధిగా నిలబడుతున్న సాయికుమార్‌ని గెలిపిస్తారా? లేదా? అనేది సందేహమే.
ఇక ఈయనకు బిఫామ్ ఇవ్వడం లేటయింది. దాంతో సాయికుమార్ మద్దతుదారులు యడ్యూరప్ప ఇంటి వద్ద ఉన్న బారికేడ్లను తోసుకుని నానా హంగామా చేశారు. ఈ సందర్భంగా బెంగుళూరులోని యడ్యూరప్ప వారితో మాట్లాడారు. సాయికుమార్‌కి టిక్కెట్ ఇస్తున్నామని, కొన్ని కారణాల వల్లే ఆయన పేరు ప్రకటించలేకపోయామని సర్దిచెప్పారు. దాంతో సాయికుమార్ అనుచరులు శాంతించారు. సాయికుమార్ బాగేపల్లిలో నామినేషన్ దాఖలు చేశాడు. ఈయన నామినేషన్ వేసే సందర్భంగా కదిరిలోని లక్ష్మీనరసింహాస్వామి వారిని దర్శించుకున్నాడు.