మే 4వ తేదీన అల్లుఅర్జున్ నటిస్తున్న 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' చిత్రం మలయాళంతో పాటు తమిళంలో కూడా విడుదలకు సిద్దమవుతోంది. తమిళంలో ఈ చిత్రం 'ఎన్‌పేరు సూర్య' పేరుతో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తమిళనాట ప్రముఖ తమిళ నిర్మాత జ్ఞానవేల్‌రాజా విడుదల చేస్తున్నాడు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టాలీవుడ్‌ని ఆకాశానికి ఎత్తి వేశాడు. తెలుగు ఇండస్ట్రీలో నటీనటులు ఎంతగానో సహకరిస్తారు. అక్కడ 100 కోట్లు వసూలు చేయగలిగిన హీరోలు కూడా 15కోట్ల కంటే రెమ్యూనరేషన్ తీసుకోరు. అది కూడా అడ్వాన్స్‌గా కేవలం ఐదు లక్షలే తీసుకుంటారు. తెలుగు చిత్ర పరిశ్రమను చూసి తమిళ చిత్ర పరిశ్రమ ఎంతో నేర్చుకోవాలి. టాలీవుడ్ గురించి బాలీవుడ్‌లో కూడా గొప్పగా చెప్పుకుంటారు. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమ సుభిక్షంగా ఉంది.
తమిళ స్టార్స్ అలాకాదు. వారు 50కోట్లు పారితోషికం తీసుకుంటారు. అది కూడా సినిమా షూటింగ్ మొదలయ్యే ముందే తీసుకుంటారు. ఈ విషయంలో నడిగర్‌సంఘంతో పాటు నిర్మాతల మండలి కూడా కలిసి సరైన నిర్ణయం తీసుకోవాలి. ఈ విషయంలో తమిళ హీరోలు తెలుగు వారిని చూసి నేర్చుకోవాలని చెప్పాడు. అయినా దూరపుకొండలు నునుపు అనే విషయం విదితమే. అలా జ్ఞానవేల్‌రాజాకి తెలుగు పరిశ్రమ ఎంతో గొప్పగా కనిపిస్తూ ఉండవచ్చు. 'మేడిపండు చూడ మేలిమై ఉండు పొట్ట విప్పి చూడ పురుగులుండు' అనేది టాలీవుడ్‌ని దగ్గరగా చూసిన వారికి అర్ధమవుతుంది...!