నేటిరోజుల్లో ప్రతి ఒక్కరు మీడియాను, జర్నలిస్ట్‌లను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. నిజానికి మీడియా రంగంలో అంటే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింటు మీడియా జర్నలిస్ట్‌లకు జీతాలు ఉండవని ఎంతమందికి తెలుసు? మీడియా అధినేతలు కూడా మీరు పై ఆదాయాలు సంపాదించుకోండి.. అంతేగానీ జీతాలు ఇవ్వమని చెబుతున్నారు. ఇక మీడియా అంటే కేవలం ఆయా మీడియాల అధిపతులే అనే దురభిప్రాయం ఉంది. ఎంత నిజాయితీ కలిగిన జర్నలిస్ట్ అయినా నేటిరోజుల్లో మీడియాలో పనిచేసేవారికి వాటి యాజమాన్యాలు జీతాలు ఇవ్వవు. బయట సంపాదించుకోండి అంటారు. పైగా ఇంత యాడ్ రెవిన్యూ తేవాలని, పక్క చానెల్స్‌కంటే ఎక్కువ మొత్తాలను యాడ్స్ కలెక్ట్ చేయాలని ఒత్తిడి తెస్తున్నాయి. ప్రతి రంగంలో ఉండే వారి మీద ఫలానా పారిశుద్దకార్మికులకు జీతాలు ఇవ్వడం లేదు. ఫలానా జూనియర్ ఆర్టిస్టులకు, లైట్ బాయ్‌ల కష్టాలను, కృష్ణానగర్ వ్యథలను వివరించే రాసే జర్నలిస్ట్‌లకే జీతాలు లేకపోతే మరి జర్నలిస్ట్‌లు ఎలా బతకాలి? ఇక మీడియా ఎంత విస్తృతంగా వ్యాపించి, పోటీ తత్వం ఎంతగా పెరిగితే కొత్త కొత్త సమస్యలను కూడా హైలైట్ చేయడానికి ప్రజాస్వామ్యంలో వీలుంటుంది.
ఇక తాజాగా బాలీవుడ్ లెజెండ్ అని చెప్పుకోదగిన నసీరుద్దీన్ షా మాట్లాడుతూ, దేశంలో జరుగుతున్న అత్యాచార ఘటనలు, కాస్టింగ్‌కౌచ్ వంటి వాటిని మీడియా హైలైట్ చేయడం సంతోషకరమైన విషయమని, ఇలాంటి సంఘటలు మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్లడం శుభపరిణామం అనిచెప్పాడు. ఇలాంటి ఘటనలు నాలుగుగోడల మద్య ఆగిపోకూడదని, ఎందరు మీడియాను విమర్శించినా మీడియా మాత్రం తమ ధోరణిని కొనసాగిస్తేనే ప్రజాస్వామ్యం విలువ పెరుగుతుందని చెప్పాడు. గతంలో ఇలాంటి వాటి విషయంలో తమలో తాము తమ బాధలు పడి, బయటికి చెప్పుకోవాలంటే పలువురు మహిళలు భయపడేవారని కానీ నేడు మీడియా బాగా ఉండటం వల్ల తప్పు చేసిన వారు భయపడాలి గానీ, మనమెందుకు భయపడాలని మీడియా ముందుకు బాధితులు వస్తున్నారని ఈయన తెలిపాడు.
ఇక ఇలాంటి సంఘటనలను ఏదో తమ ఇండస్ట్రీ వ్యవహారం అనో, తమ అంతర్గత సమస్య అనో అనుకోవడానికి వీలులేదు. మీడియా వ్యాపించిన నేపధ్యంలో మీడియా బాధితుల గళం వినిపిస్తూనే ఉండాలి. ఇంతకు ముందు కూడా సినీ పెద్దలు తమని ఇబ్బంది పెట్టిన జర్నలిస్ట్‌లను, సినీపత్రికల అధినేతలను బాయ్‌కాట్ చేసి తమ దారికి తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు అది జరిగే పని కాదని అర్ధమవుతోంది. నాడు దిల్‌రాజు కేవలం రెండు మూడు చానెల్స్‌కి మాత్రమే యాడ్స్ ఇవ్వాలని నిర్ణయించినప్పుడు మీడియా భగ్గుమంది. ఇక తాజాగా చిరంజీవి చొరవతో మహేష్‌బాబు, రామ్‌చరణ్, అల్లుఅర్జున్, నాని, నుంచి పలువురు టాలీవుడ్ ప్రముఖులు సమావేశమై టివి5, టివి9, ఎబిఎన్ ఆంధ్రజ్యోతిలు కేవలం సినిమా యాడ్స్ మీదనే బతుకుతున్నాయని, ఇక ఈ చానెల్స్‌తో పాటు అన్ని చానెల్స్‌ని ఎవ్వరూ ప్రోత్సహించకూడదని, సినిమా కంటెంట్, యాడ్స్‌ని ఇవ్వరాదని తీర్మానం చేశారట. దీని వల్ల న్యూస్ చానెల్స్‌కి వచ్చే ఇబ్బందేమీ పెద్దగా ఉండదు. సినిమా యాడ్స్‌కాకుంటే కమర్షియల్ యాడ్స్ మీద దృష్టిపెడతారు.
అంత మీడియాపై రివేంజ్ తీర్చుకోవాలన్న కసి ఉంటే స్టార్‌మా, జెమిని చానెల్, జీ తెలుగు వంటి ఎంటర్‌టైన్‌మెంట్ చానెల్స్‌కి శాటిలైట్ రైట్స్ ఆపగలరా? అవి కూడా మీడియాలో భాగమే కదా...! మరి ఈ సిని పెద్దలు న్యూస్ చానెల్స్‌ని మాత్రం ఏమి చేయలేరని చెప్పవచ్చు. పోనీ మీడియాపై నిషేధం విధించినా, సోషల్‌మీడియాను ఎవ్వరూ ఏమి చేయలేరు. వారిని నియంత్రించడం వీలు కాని పనే అనిచెప్పాలి. మొత్తానికి ఈ వ్యవహారం చివరకు సినిమావారికే ఎదురు దెబ్బ తగిలి, సెల్ఫ్‌గోల్‌గా మారుతుందని మాత్రం చెప్పవచ్చు.