బాలకృష్ణ - తేజ కాంబోలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ బయోపిక్ గత నెలలోనే మొదలైంది. మొదలైన రెండు రోజులు షూటింగ్ జరుపుకున్న 'ఎన్టీఆర్' సినిమా వచ్చే నెల నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. బాలకృష్ణ తన తండ్రి బయోపిక్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలని చూస్తున్నాడు. అయితే ఈ సినిమా మెయిన్ లీడ్ లో తన తండ్రి పాత్రలో బాలకృష్ణ నటిస్తున్నాడు. ఇక మిగతా కీలక పాత్రల్లో ఎవరు నటిస్తారనే దాని మీద మాత్రం అస్సలు క్లారిటీ రావడం లేదు. ఎందుకంటే ఈ సినిమాలో ఇంకా హీరోయిన్ సెట్ కాలేదు. అలాగే చంద్రబాబు పాత్రకి, ఇంకా నందమూరి కుటుంబ సభ్యుల పాత్రలకి బాలయ్య ఎవరిని ఎంపిక చేస్తారనే ఆసక్తి ప్రేక్షకుల్లో బాగా ఉంది.
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ బయోపిక్ లో.. నందమూరి కుటుంబం నుండి బాల ఎన్టీఆర్ లుగా నారా, నందమూరి వంశాల వారసుడు, లోకేష్ కుమారుడు దేవాన్ష్ తో పాటు, కల్యాణ్ రామ్ కుమారుడు శౌర్యారామ్ కనిపించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఎన్టీఆర్ కొడుకు హరికృష్ణ పాత్రలో ఆయన కొడుకు కళ్యాణ్ రామ్ నటిస్తాడని... అంటున్నారు. ఇకపోతే బాల ఎన్టీఆర్ గా దేవాన్ష్, యువ ఎన్టీఆర్ గా శౌర్యారామ్ కనిపిస్తారని సమాచారం. దీన్ని బట్టి బాలయ్య కొడుకు మోక్షజ్ఞ 'ఎన్టీఆర్' సినిమాలో నటించడం లేదని తేలిపోతుంది. ముందు నుండి ఎన్టీఆర్ యంగ్ పాత్రలో మోక్షజ్ఞ కనబడతాడనే ప్రచారం జరిగింది.
కానీ బాలకృష్ణ మాత్రం మోక్షజ్ఞ ని హీరోగా మాత్రమే వెండితెరకి ఇంట్రడ్యూస్ చెయ్యాలని భావిస్తున్నాడట. అందుకే 'ఎన్టీఆర్' సినిమాలో మోక్షజ్ఞని తీసుకోవడం లేదని అంటున్నారు. ఇక మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇచ్చే చిత్రం కూడా లేట్ అవుతుందని తెలుస్తుంది. ఎందుకంటే మోక్షు ప్రస్తుతం బాగా బరువు పెరిగి ఉన్నాడు. మరి హీరో అవ్వాలంటే కాస్త స్లిమ్ గా పూర్తి ఫిట్నెస్ తో ఉండాలి. కానీ మోక్షు అలా లేడు. అందుకే ఈఏడాది మోక్షజ్ఞ ఎంట్రీ లేనట్టే అని నందమూరి అభిమానులు ఫిక్స్ అవుతున్నారు. ఇక బాలకృష్ణ - తేజ లిద్దరు 'ఎన్టీఆర్' బయోపిక్ ని రెండు భాగాలుగా నిర్మించే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎన్టీఆర్ నట జీవితం ఒక భాగం, ఎన్టీఆర్ రాజకీయ జీవితం రెండో భాగంగా ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది.