నిజానికి పవన్‌కళ్యాణ్, ఆయన సోదరుడు నాగబాబు వంటి వారి మాటలు వింటుంటే పవన్ కళ్యాణ్ జనాలకు మేలు చేయడానికి రాజకీయాలలోకి వచ్చాడా? లేక ప్రజారాజ్యం పార్టీ సమయంలో తమని మోసం చేసి, ఎదగనివ్వకుండా చేశారని, వారిని టార్గెట్ చేయడానికే జనసేన పెట్టాడా? అనే అనుమానం రాకమానదు. కొంతకాలం కిందట పవన్ అందరినీ గుర్తుపెట్టుకుంటాను. పీఆర్పీని మోసం చేసిన ఎవ్వరినీ వదలను అని ఆవేశంగా చెప్పాడు. నాడు అది ఏదో ఆవేశంలో చెప్పాడేమో అని అందరు భావించారు. కానీ తాజాగా 'నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' సందర్భంగా నిర్మాతలలో ఒకడిగా వ్యవహరిస్తున్న నాగబాబు మరలా అదే ఆవేశంతో అవే వ్యాఖ్యలు చేశాడు.
వర్మని అక్కుపక్షి అని తిట్టి, అతని పర్సనల్ విషయాలను కూడా ఎత్తి, నాగబాబు గతంలో తప్పు చేశాడు. దాని వల్ల వారికి వనకూడింది ఏమైనా ఉందా? అంటే లేదనే చెప్పాలి. వర్మ టార్గెట్‌కి, ఇంకా మరికొందరిని రెచ్చగొట్టినట్లు అయింది. ఇక అనాలోచితంగా యండమూరిని కూడా నానా మాటలు అన్నాడు. ఇవ్వన్నీ పవన్‌కి రాజకీయంగా మేలు చేయకపోయినా చెడుని మాత్రం చేస్తాయి. మెగాభిమానులు చూపిస్తున్న ఓవర్‌యాక్షన్ చూసి సామాన్యులు కూడా వీరు అధికారంలోకి రాకుండానే ఇలా అంటున్నారు. చేస్తున్నారు. నిజంగా వీరికే అధికారం వస్తే చంద్రబాబు, జగన్‌లకి మించిన దౌర్జన్యాలు, ఫ్యాక్షనిజంని పోషిస్తారనేది సామాన్యులలో నాటుకు పోతోంది.
ఇక నాగబాబు 'నా పేరు సూర్య' వేడుకలో మాట్లాడుతూ, గొప్ప పేరును, కోట్లాది రూపాయలను తృణప్రాయంగా భావించి పవన్ ప్రజల కోసం రాజకీయాలలోకి వచ్చాడు. అతని మీద నీచరాజకీయం చేస్తున్నారు. వ్యక్తిగతంగా మాట్లాడుతూ టార్గెట్ చేస్తున్నారు. నీచంగా మాట్లాడుతూ, అందరికి చూపిస్తున్నారు. ఆయన వస్తే వాళ్ల ఆటలు సాగవని, వాళ్లకు యుక్తులు చాలవని నీచంగా మాట్లాడుతున్నారు. పవన్‌కళ్యాణ్ ఒక్కడు కాదు.. ఆయన వెనుక ఎందరో పవన్‌కళ్యాణ్‌లు ఉన్నారు. ఆయన రాకూడని కోరుకునే వారి దుమ్ముదులిపేలా పవన్ వస్తున్నాడు. దేవుడు మీరూపంలో చాలా ఇచ్చాడు. డబ్బులు సంపాదించడానికి రాలేదు. స్కాంలు చేయాల్సిన అవసరం లేదు. చివర్లో ఒక్కోక్కడికి ఉంటది. ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. గతంలో దెబ్బలు తిన్నాం.. ఈసారి మాత్రం వదిలే సమస్యలేదంటూ మరోసారి ప్రజారాజ్యం ప్రస్తావన తెచ్చాడు. ఒక్కొక్కరికి ఉంటది అని రెచ్చగొట్టడం, మీడియాను దూరం చేసుకోవడం చూస్తుంటే పీఆర్పీ వైఫల్యాల నుంచి నాగబాబు వంటి వారు ఏమీ నేర్చుకోలేదని అర్ధమవుతోంది. దీంతో జనసేన కేవలం మెగాభిమానుల, కాపుల పార్టీగానే మిగిలిపోయేలా ఉంది...!