కిషన్‌రెడ్డి చెప్పినట్లు బాలయ్యకి సినిమాలు, నిజజీవితం మధ్య తేడా అసలు కనిపించడం లేదు. సినిమాలలో ప్రవర్తించిన విధంగా, సెటైర్లు, పంచ్‌లు వేసిన విధంగా తాజాగా విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబు చేసిన దీక్షలో బాలయ్య మోదీని శిఖండితో పోల్చి, కొజ్జాగా అభివర్ణించడం, కేంద్రం వాహనాలు రాష్ట్రంలో తిరగనివ్వమని బెదిరించడం, బాలయ్య ప్రసంగం, ఆయన హిందీలో చేసిన ఉపన్యాసం, హిందీలో ఓ అనకూడని బూతును వాడటంతో వివాదం చెలరేగుతోంది. దీనిపై గుంటూరు జిల్లా చిలకలూరి పేటలోని రామకృష్ణ థియేటర్‌లో జై సింహా వందరోజులు ఆడిన సందర్భంగా బాలయ్యతో పాటు కె.ఎస్.రవికుమార్ వంటి వారు ఈ వేడుకకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా బాలయ్య తన మాటలపై వివరణ ఇస్తూ తాను ప్రత్యేకహోదా విషయంలో ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్నే చెప్పానని, తానేమి తప్పుడు మాట అనలేదని, తనకు హిందీ బాగా వచ్చని సెలవిచ్చాడు. మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాలలోని బిజెపి నాయకులు మాత్రం బాలయ్యపై మండిపడటమే కాదు.. ప్రధానమంత్రిని అంత మాట అంటావా? అని పోలీస్‌స్టేషన్లలో కేసులు పెడుతున్నారు. ఇక మోదీ సంగతి అందరికీ తెలిసిందే. ఆయనో నియంత. తన గురించి ఎవరేం మాట్లాడినా ఆయన సమాచారం తెప్పించుకుని , వాటిని మర్చిపోకుండా తనదైన టైం వస్తే నానా ఇబ్బందులు పెడతాడు. మరి వచ్చే ఎన్నికల్లో ఏపీలో టిడిపి ఓడిపోయి, కేంద్రంలో బిజెపి మరోసారి అధికారంలోకి వస్తే మాత్రం మోదీ బాలయ్యను, చంద్రబాబుని ఖచ్చితంగా టార్గెట్ చేసే అవకాశం ఉంది.
ఇప్పటికే బిజెపి నేతలు, బాలయ్య బెల్లంకొండ సురేష్ మీద కాల్పుల విషయాన్ని, నాడు కాకర్ల సుబ్బారావు చేత ఆయన మతిస్థిమితం సరిగా లేదని సర్టిఫికేట్ తెప్పించుకుని ఆ కేసు నుంచి బయటపడటాన్ని ప్రస్తావిస్తున్నారు. అందులోనూ బాలయ్య ఏకంగా హిందీలో మాట్లాడటం, ఆ వ్యాఖ్యలు జాతీయ మీడియాలో కూడా ప్రసారం కావడం ఇప్పుడు బాలయ్యకి పెద్ద చిక్కుగా మారే అవకాశాలు ఉన్నాయని మాత్రం చెప్పవచ్చు. రాజకీయాలలో కోపం, ఆవేశం వంటి వాటికి తావుండకూడదని బాలయ్య ఎప్పుడు తెలుసుకుంటాడో మరి...!