రామ్‌చరణ్ అంతకు ముందు ఒకే ఒక్క చిత్రం చేసిన సంపత్ నందికి ధరణితో చిత్రం కాదని చెప్పి 'మెరుపు'ను ఆపేసి మరీ 'రచ్చ' చిత్రం ఇచ్చాడు. ఇక 'రచ్చ' చరణ్ కి మంచి మాస్ ఇమేజ్ ని ఇచ్చింది. ఇక విషయానికి వస్తే ప్రస్తుతం నవతరం దర్శకుల హవా నడుస్తోంది. పలువురు యంగ్ డైరెక్టర్స్ విభిన్నమైన కథలతో, ప్రయోగాలకు వెనుకాడడం లేదు. ఇటీవలనే 'తొలిప్రేమ, ఛలో, అర్జున్ రెడ్డి' వంటి పలు చిత్రాలు వచ్చి బాగానే ఆడాయి. ఇక తాజాగా తన మొదటి రెండు చిత్రాలైన 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్‌రాజా' వంటి చిత్రాలను తీసి, విభిన్నమైన ఎంటర్‌టైన్‌మెంట్ పండించగలనని దర్శకుడు మేర్లపాక గాంధీ నిరూపించుకున్నాడు. దాంతో ఆయన్ని నమ్మి నేచురల్ స్టార్ నాని ఆయనతో 'కృష్ణార్జున యుద్దం' చేశాడు. కానీ ఈచిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది. నాని సినిమాల రేంజ్‌లో ఈ చిత్రం లేదని పలువురు పెదవి విరిచారు.
ఇక ఇప్పుడు మేర్లపాక గాంధీ తాను మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌తో ఓ చిత్రం చేయడం గ్యారంటీ అని చెబుతున్నాడు. 'కృష్ణార్జున యుద్దం' ముందు నాతో రామ్‌చరణ్ సినిమా ప్రారంభం కావాల్సివుంది. అయితే ఆ ప్రాజెక్ట్ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. చరణ్‌కి ఆ కథను వినిపించాను కూడా. అయితే ఈ చిత్రం వాయిదా పడిందే గానీ ఆగిపోలేదు. పోస్ట్ పోన్ అయింది అంతే. నాకు చరణ్ అంటే ఎంతో ఇష్టం. ఆయనతో నాకు మంచి సాన్నిహిత్యం ఉంది. మా ఇద్దరి చిత్రం త్వరలో ప్రారంభమవుతుందని నమ్మకంగా చెబుతున్నాడు. ఇక 'కృష్ణార్జున యుద్దం' చూసిన తర్వాత కూడా చరణ్ ఆయనకి చాన్స్‌ఇస్తాడా? అనేది ఆలోచించాల్సి వుంది.
ముఖ్యంగా మెగా కాంపౌండ్ స్నేహానికి స్నేహమే తప్ప స్నేహం కోసం సినిమాలు చేయడం అరుదు. మరి ఈ విషయంలో మేర్లపాక గాంధీ ఎందుకు అంత నమ్మకంగా చెబుతున్నాడు? అనేది వేచిచూడాల్సి వుంది. మరోవైపు రామ్‌చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం, ఆ వెంటనే రాజమౌళితో ఎన్టీఆర్, చరణ్‌ల ప్రాజెక్ట్స్ లైన్‌లో ఉన్నాయి. 'రంగస్థలం' తర్వాత చరణ్ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మేర్లపాక గాంధీ కోరికను చరణ్ తీరుస్తాడో లేదో వేచిచూడాల్సి వుంది!