గత పది చిత్రాలలో పూరీకి 'టెంపర్' మినహా మరో హిట్ లేదు. ఏరికోరి ఆయనను ఎంచుకున్న వరుణ్‌తేజ్‌కి 'లోఫర్'తో, నందమూరి కళ్యాణ్‌రామ్‌కి 'ఇజం'తో ప్లాపిచ్చాడు. ఇక ఏకంగా బాలయ్య పిలిచి మరీ ఆఫర్ ఇస్తే రొటీన్ మూసగొట్టుడు చిత్రంగా 'పైసావసూల్'ని తీసి, మరోవైపు తనపై నమ్మకం ఉంచి, మొదటి చిత్రం అవకాశం ఇచ్చిన 'రోగ్'ని కూడా దారుణంగా తీశాడు. దీంతో పూరిలో ఉన్న సత్తా తగ్గిందా? ఆయనలోని గుజ్జు అయిపోయిందా? తన గురువు వర్మ బాటలో నడుస్తున్నాడా? అనే అనుమానాలైతే బాగా వచ్చాయి. ముఖ్యంగా ఆయన తొందరగా చిత్రాలను తీయాలనే పేరుతో చుట్టేస్తున్నాడని కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి.. ఇంకా వస్తున్నాయి.
ఇక తాజాగా ఆయన తన కుమారుడు ఆకాష్ పూరీని హీరోగా రీఎంట్రీ ఇప్పిస్తూ ఓ ముస్లిం యువతి, ఓ సైనికుడి మధ్య పాక్‌తో భారత్ యుద్దం సమయంలో జరిగిన ఓ పీరియాడికల్ లవ్ అండ్ రోమాంటిక్ మూవీగా 'మెహబూబా'ని తీస్తున్నాడు. దీనికి ఆయనే నిర్మాత. ఈ చిత్రం వరుస ఫ్లాప్‌లలో ఉన్న ఆయనకు, మొదటి చిత్రం 'ఆంధ్రాపోరి'తో దెబ్బతిన్న ఆకాష్ పూరీకి కూడా ఎంతో కీలకమైన చిత్రంగా చెప్పుకోవాలి. ఇక 'మెహబాబూ' చిత్రాన్ని ఆయన మే 11వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. మిగిలిన పూరీ చిత్రాల మాదిరే ఈ చిత్రం పోస్టర్స్, లుక్స్, టీజర్స్ ఆకట్టుకుంటున్నాయి. మరి వీటిల్లో ఉన్న విషయం సినిమాలో ఉంటుందా? లేదా? అనేది వేచిచూడాల్సివుంది.
మరోవైపు ఎంత ఫ్లాప్‌లలో ఉన్నా కూడా వరుస చిత్రాలు చేసే పూరీ తన తదుపరి చిత్రం కోసం కూడా ఆల్‌రెడీ ఓ స్క్రిప్ట్‌ని రెడీ చేశాడట. 'మెహబూబా' హిట్ అయితే ఈ చిత్రానికి రామ్‌చరణ్‌ని ఒప్పించవచ్చని, రామ్‌చరణ్‌తో వీలు కాకపోయినా వరుణ్‌తేజ్‌తో అయినా ముందుకెళ్లాలనేది పూరీ నిర్ణయంగా తెలుస్తోంది. ఏది ఏమైనా 'మెహబూబా' రిజల్ట్ మీదనే ఆయనకు ఎవరు చాన్స్ ఇస్తారు? అనేది నిర్ణయం కానుంది. ఇదో పొలిటికల్ నేపధ్యం ఉన్న సెటైరిక్ మూవీ అని తెలుస్తోంది. ఇంతకు ముందు పూరీతో రామ్‌చరణ్ తన మొదటి చిత్రం 'చిరుత' చేశాడు. తర్వాత మరోమెగా హీరో వరుణ్‌తేజ్‌తో 'లోఫర్' తీశాడు. ఈ రెండు చిత్రాల తర్వాత రామ్‌చరణ్, వరుణ్‌తేజ్‌లలో ఎవరు పూరీతో సినిమా చేసినా కూడా అది వారి రెండో పూరీ చిత్రం అవుతుందని మాత్రం చెప్పవచ్చు.