ప్రస్తుతం ఎవరు ఏ పని తలపెట్టినా కూడా మీడియా అటెంక్షన్ సాధించేందుకు సినిమా వారి మీదనే ఆధార పడుతున్నారు. ఇక తాజాగా జరిగిన తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నిర్వహించిన కార్యక్రమానికి దర్శకుడు ఎన్‌కౌంటర్ శంకర్, హీరో సుమన్, ఆర్.నారాయణమూర్తులు హాజరై ప్రసంగించారు. ఈ సందర్బంగా దర్శకుడు శంకర్ మాట్లాడుతూ, బిసీలలో ఐక్యత లేదు. అందుకే అగ్రకుల రాజకీయాలకు ఇప్పటికీ వంత పాడుతున్నారు. ఏ పార్టీలో ఉన్నప్పటికీ బీసీలందరు సమైక్యంగా ఉంటేనే రాజ్యాధికారం సాధ్యమవుతుంది. అగ్రవర్ణాలలో విభజనలు లేవని, కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీలలోనే విభజనలు ఎందుకున్నాయని శంకర్ ప్రశ్నించాడు. బీసీలకు చెందిన అందరు ఇకపై తమ వాహనాలపై బీసీ స్టిక్కర్ అంటించుకుని గర్వంగా ముందుకెళ్లాలి..అన్నాడు.
ఇక సుమన్ మాట్లాడుతూ.. బీసీలు తాము బీసీలమని చెప్పుకోవడానికి సిగ్గు పడుతున్నారు. ఇందులో సిగ్గు పడాల్సింది ఏముంది..? ఇకపై బీసీలమని చెప్పుకునేందుకు గర్వపడాలి. బీసీలు రాజ్యాధికారం దిశగా పయనించాలి. ఈ క్రమంలో విద్య, ఉపాధి రంగాలలో ముందడుగు వేయాలి. బీసీలు లేకుండా, బీసీ ఓట్లు లేకుండా ఏపార్టీ కూడా మనుగడ సాగించలేదు. ఇక సుమన్, శంకర్ చెప్పింది నిజమే అయినా పోను పోను కుల రాజకీయాలు పెచ్చరిల్లుతున్నాయి. బిసిలకు ఇప్పటి వరకు ఆర్.కృష్ణయ్య చేసింది ఏమిటి? ఆర్.కృష్ణయ్యని ముఖ్యమంత్రిని చేస్తామని చంద్రబాబు ప్రతిపాదించినా టిడిపికి తెలంగాణలో పట్టు ఎందుకు పోయింది? అనేది పాయింట్.
కేవలం బీసీలు కాబట్టే పదవులు అలంకరించాలని కాకుండా మంచి పరిపాలనాధ్యక్షులు ఎవరైనా సరే.. నీతి, నిజాయితీ చూసి పట్టం కట్టాలని ఈ బాధ్యత కలిగిన నటులు, దర్శకులు భావించకుండా కేవలం బీసీలు రాజ్యాధికారం సంపాదించుకోవడమే పరమావధి అని భావించడం తప్పు. మరి బీసీ అయినా మన ప్రధాని మోదీని అందరు కలిసే ఎన్నుకున్నారు. ఆయన పాలన నచ్చకపోతే ప్రజలందరు కలిసి ఓడిస్తారు. కానీ మోదీ బీసీ అయినంత మాత్రాన ఆయనకే మద్దతు తెలపాలనే నినాదాలు, జనాలను, బీసీలను రెచ్చగొట్టడం సమంజసం కాదు. ఇలాంటి వ్యాఖ్యల వల్లనే పలు కులాల వారు తమని కూడా బీసీలలో చేర్చమని ఆందోళనలు చేస్తున్నారు. వారిని రెచ్చగొట్టేలా సుమన్, శంకర్‌ల వ్యాఖ్యలు ఉన్నాయి.