అసలు సినిమా వారు ఈ కోణంలో ఆలోచించడం లేదు గానీ సినిమా కూడా మీడియాలో ఒక భాగమే. వారు తమ సినిమాలలో సమాజంలో జరుగుతున్న సంఘటనలను చూపిస్తున్నట్లుగానే మీడియా కూడా తమ దృష్టికి వచ్చిన అంశాలను చూపిస్తూ ఉంటుంది. ఇక మీడియాకైనా, సినిమాకైనా ప్రేక్షకులు, వీక్షకులు, శ్రోతలు వంటి వారు దేవుళ్లు. అలాంటి మీడియా మీద అక్కస్సుతో ఫలానా టీవీ చానెల్ చూడకండి.. ఫలానా పత్రిక చదవకండి అని అనడం అవగాహనా రాహిత్యం. ఇక నాడు కేసీఆర్ ఎబిఎన్ ఆంధ్రజ్యోతిని, టివి9ని ప్రసారాలు నిలిపివేసినప్పుడు పవన్ బాగానే స్పందించాడు. ఇక పలు దుర్ఘటనలు జరిగి ఎందరో ప్రాణాలు కోల్పోయినా వచ్చి చూడకుండా, పరామర్శించకుండా కేవలం ట్వీట్స్‌తోనే కాలక్షేపం చేసిన ఆయన ఆంధ్రజ్యోతి పత్రిక కార్యాలయంలో చిన్న ప్రమాదం జరిగి, కేవలం కొద్ది పాటి ఆస్తి నష్టం మాత్రమే జరిగినప్పుడు మాత్రం అదే పనిగా ఆంధ్రజ్యోతి ఆఫీస్‌కి వెళ్లి పరామర్శించి వచ్చాడు.
ఇలా పవన్ ఎన్ని విధాలుగా తన సిద్దాంతాలను, నిర్ణయాలను మార్చుకుంటూ ఉన్నాడు. ఈరోజు చెప్పిన మాట పక్కరోజు చెప్పడం లేదు. వర్మ చెప్పినట్లుగా పవన్, కేసీఆర్‌లు ఎన్నోసార్లు తిట్టుకుని మరలా కలిసి భోజనం చేశారు. అంటే పవన్ రంగులు మారిస్తే ఫర్వాలేదు గానీ దానిని విమర్శిస్తే మాత్రం ఆయన తట్టుకోలేడు అనేది అర్ధం అవుతోంది. ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత ఇక కుటుంబం, వ్యక్తిగతం వంటివి ఏమీ ఉండవు. మీ సొంత పనులు మీరు చూసుకున్నంత కాలం మేమేమీ మీ వ్యక్తి గత విషయాలలోకి తొంగిచూడం. అదే సెలబ్రిటీలు, రాజకీయ నాయకులుగా మారితే మాత్రం మీ కుటుంబాన్నికూడా వదిలిపెట్టకుండా దుమ్ము దులుపుతామని శ్రీశ్రీ నాడే చెప్పాడు.
ఇక విషయానికి వస్తే పవన్‌ని శ్రీరెడ్డి తిట్టిన తిట్లు పవన్‌కి ఇంత ఆవేదన కలిగిస్తే. పవన్ ఫ్యాన్స్ పేరుతో పలువురి టార్గెట్ చేస్తూ, తమ హీరోని అభిమానించే వారికి వ్యతిరేకంగా ఒక మాట అన్నా వారు వాడే భాష ఎంతో నీచంగా ఉంటుంది. తాజాగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, తనపై టివి9 శ్రీనిరాజు పరువు నష్టం దావా వేస్తున్నాడని, తన ఫ్యాన్స్ సహనంగా ఉండాలని, ఎటువంటి విధ్వంసక చర్యలకు పాల్పడ వద్దని కోరాడు. మన సోదరీమణులు, అమ్మలు, కూతుర్లను దుర్భాషలాడుతూ, కథనాలు ప్రసారం చేసే టివి9, టివి5, ఎబిఎన్ ఆంధ్రజ్యోతి వంటి చానెల్స్‌ని బహిష్కరించాలని, నిస్సహాయులైన వారికి సహాయం చేయాల్సింది పోయి, వారిని అశ్లీలంగా చూపిస్తూన్నాయని వాటిని బాయ్‌కాట్ చేయాలని సూచించాడు.
ఇక నేను కూడా ఆ చానెల్స్ అధిపతులపై నిరవధికంగా, సుదీర్ఘంగా న్యాయపరమైన యుద్దం చేస్తానని ప్రకటించాడు. ఇంతవరకు బాగానే ఉన్నా పవన్ తన ఫ్యాన్స్‌లోని కొందరినీ బూతులు మాట్లాడకుండా, సంయమనంతో వ్యవహరించాలని కోరితే ఇంకా బాగుండేది. మొత్తానికి ఎబిఎన్ వ్యాన్‌పై పవన్ అభిమానులు దాడి చేసినట్లుగా భవిష్యత్తులోఇలాంటి సంఘటనలు జరిగితే వాటికి పరోక్షంగా పవనే కారకుడవుతాడని చెప్పవచ్చు.