కొరటాల -మహేష్ బాబు కాంబో మళ్ళీ తెర మీద బంపర్ హిట్ కొట్టింది. 'భరత్ అనే నేను' థియేటర్స్ లో బ్యాండ్ బాజా మోగిస్తుంది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'భరత్ అనే నేను' హిట్ టాక్ తో థియేటర్స్ దుమ్ము దులుపుతుంది. 'భరత్ అనే నేను' లో మహేష్ బాబు సీఎం గా చేసిన నటనకు ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. 'బ్రహ్మ్మోత్సవం, స్పైడర్' డిజాస్టర్ లో ఉన్న మహేష్ బాబుకి ఈ 'భరత్ అనే నేను' తో దాహం తీరిపోయే హిట్ వచ్చేసినట్లే. ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం, స్క్రీన్ ప్లే, మహేష్ నటన, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ఇలా అన్ని హైలెట్ గా నిలిచాయి. కథ రొటీన్ గా ఉన్నప్పటికీ కొరటాల మేకింగ్ స్టయిల్ తో సినిమాని నిలబెట్టేశాడు.
ఇక సినిమా విడుదలై మొదటి షో ముగిసేసరికి 'భరత్ అనే నేను' సినిమా పాజిటివ్ టాక్ తో నిండిపోయింది. ఇండస్ట్రీలోని పలువురు 'భరత్ అనే నేను' లో మహేష్ నటనను తెగ పొగిడేస్తున్నారు. 'బాహుబలి' రాజమౌళి ఎప్పుడు తనకు నచ్చిన సినిమాని చూసిన వెంటనే ట్వీట్ చేస్తుంటాడు. ఇప్పుడు రాజమౌళి 'భరత్ అనే నేను' సినిమా చూసి సినిమా అదిరిపోయిందంటూ ట్వీటేసాడు. ఆ ట్వీట్ లో జక్కన్న... 'ఒక కమర్షియల్ సినిమాలో స్వయంపాలన వంటి అంశాన్ని ప్రస్తావించడమనేది కొరటాల గొప్పతనం. ముఖ్యంగా ప్రెస్ కాన్ఫరెన్స్ సీన్ చాలా బాగా వచ్చింది' అంటూ కొరటాల డైరెక్షన్ ని తెగ మెచ్చేసుకున్నాడు.
అలాగే రాజమౌళి... భరత్ అనే నేను సినిమాలో 'మహేశ్ బాబు అద్భుతమైన నటనను కనబరిచాడు. ఆయా పాత్రలకి గాను నటీనటులు బాగా కుదిరారు .. ప్రతి ఒక్కరు తమ పాత్రలలో ఒదిగిపోయారు. ఇంతమంచి సినిమాను అందించిన నిర్మాత డీవీవీ దానయ్య గారికి .. టీమ్ లోని ఇతర సభ్యులందరికీ అభినందనలు'.... అంటూ రాజమౌళి భరత్ అనే నేను పై ప్రశంసల వర్షం కురిపించాడు.