అసలు శ్రీరెడ్డి రగడంతా ఆమెకి మా అసోసియేషన్‌లో ఆమె కోరుకున్నట్లు ఫ్రీ మెంబర్‌షిప్ ఇవ్వడం లేదు అనే పాయింట్ మీదనే మొదలైంది. ఇక ఇందులో మూవీ ఆర్టిస్టు ఆసోసియేషన్ ప్రెసిడెంట్ శివాజీ రాజా తొందరపాటుగా ఆమెని బహిష్కరించడం, ఆమెతో మాలో సభ్యత్వం ఉన్న 900ల మంది నటించడానికి వీలు లేదని చెప్పడంతో ఇది ముదిరింది. ఇక ఆ తర్వాత మరలా శివాజీరాజానే దిగి వచ్చి ఆమెపై నిషేధాన్ని తీసివేస్తున్నానని చెప్పినా, అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఇక ఇప్పటికీ మా అసోసియేషన్ విషయంలో పలువురు గుర్రుగానే ఉన్నారు. అపూర్వ వంటి నటులు మాకు కూడా మా సభ్యత్వం వద్దని చెప్పి బయటకు రావడం, ఇది నియంతృత్వ పోకడ అని అందరు ఒప్పుకునే విషయమే.
ఇక తాజాగా మంచు విష్ణు వ్యాఖ్యలు కూడా దీనికి అద్దం పట్టాయి. మంచు విష్ణు ఈ విషయంపై తాజాగా స్పందిస్తూ, అసోసియేషన్‌లో మెంబర్ కాని వ్యక్తి విషయంలో 'మా' వ్యవహరించిన తీరు అభ్యంతరకరంగా ఉందని లేఖలో పేర్కొన్నాడు. 9 వందల మంది ఉన్న మా అసోసియేషన్‌లో నేను, నా తండ్రి, నా సోదరుడు, నా సోదరి కూడా ఉంది. మమ్మల్ని కూడా కలిపే ఈ నిషేధం విధించారా? అని ప్రశ్నించాడు. ఆ తర్వాత ఇండస్ట్రీలోని పెద్దల కుటుంబాలపై విషయాలను బయటపెడుతూ ఉండేసరికి ఆ నిషేధాన్ని ఎత్తి వేశారని ఎద్దేవా చేశాడు. ఇలాంటి అనాలోచిత చర్యల ద్వారా 'మా' పరువు పోతోంది. ప్రజలు, మీడియా ముందు చులకన అవుతోంది. ఓ నటునిగా, నిర్మాతగా ఎవరితో నటించాలి.? ఎవరితో పనిచేయాలనేది మా ఇష్టం ప్రకారం జరుగుతుంది. ఆ నిర్ణయం తీసుకునే హక్కు మాకే ఉంటుంది. ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి ఎవరికీ హక్కు లేదు. ఈ విషయంలో 'మా' ఆదేశాలు జారీ చేయడం సరికాదు. మీ చర్యలతో 'మా'కి చెడ్డపేరు తేవద్దు. కాస్టింగ్‌కౌచ్ ఆరోపణలు ఇండస్ట్రీకి మచ్చని తెస్తున్నాయి. ఈ విషయంలో గ్రీవెన్ సెల్స్‌ని ఏర్పాటు చేసి ఫిల్మ్‌చాంబర్‌కి ఆ బాధ్యత అప్పగించాలి...!
ఇక శ్రీరెడ్డి విషయంలో గతంలో 'మా' అధ్యక్షునిగా పని చేసిన టిడిపి ఎంపీ మురళీమోహన్ అభిప్రాయం మరోలా ఉంది. నిరసన చేసే హక్కు ఎవరికైనా ఉంటుంది. కానీ అర్ధనగ్న నిరసన చేయడం మాత్రం అభ్యంతరకరం. క్రమశిక్షణ లేనివారికి 'మా'లో సభ్యత్వం ఇవ్వరు. నేను మా అధ్యక్షునిగా ఉంటే ఆమెకి ఎట్టి పరిస్థితుల్లోనూ సభ్యత్వం ఇవ్వనని చెప్పాడు. మన క్రమశిక్షణ లేని ప్రకాష్‌రాజ్ వంటి వారిని మనం ఎంతగా నెత్తిన పెట్టుకుంటామో తెలిసిందే అన్న విషయం మురళీమోహన్ గుర్తించాలి. ఇక వైసీపీ ఎంపీలు రాజీనామా ఓ డ్రామా. వచ్చే ఎన్నికల్లో 25మంది ఎంపీలను టిడిపికి గెలిపిస్తే చంద్రబాబు రాష్ట్రానికి మేలు చేస్తాడని ఆయన చెప్పారు. మరోవైపు తన కోడలు రాజకీయాలలోకి రావడం లేదని, నేను నియోజకవర్గంలో లేనప్పుడు ఆమె అందుబాటులో ప్రజలకు ఉంటుందని తెలిపాడు.