తెలుగు తెరపై 'అమృతం' సీరియల్‌కి అభిమానులు ఎందరో ఉన్నారు. ఇక ఇందులోని మెయిన్ పాత్రను పలువురు నటులు పోషించినా కూడా హర్షవర్దన్ మాత్రం దీని ద్వారా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన తాజాగా మాట్లాడుతూ.. నేను వైజాగ్ నుంచి సంగీత దర్శకుడిని కావాలని హైదరాబాద్ వచ్చాను. అవకాశాల కోసం తిరిగే సమయంలో నటునిగా చేయవచ్చు కదా? అని పలువురు సూచించారు. నాడు నేను నటుడన్నాక ఆరడగుల హైట్, మంచి స్కిన్, పర్సనాలిటీ ఉండాలని అనుకునే వాడిని. కానీ నటునిగా నేను బిజీ అయిపోవడంతో నటునికి కావాల్సింది హైట్ వెయిట్ కాదని కేవలం అదృష్టమని అర్ధమైంది.
ఇక నేను 'రుతురాగాలు' సీరియల్ చేస్తుండగా, ఆ సీరియల్ ఆగిపోయింది. మరలా మొదలవుతుందో లేదో తెలియదు. దాంతో బాగా డిప్రెషన్‌లోకి వెళ్లాను. అప్పుడు ఓ స్నేహితుడు ఫోన్ చేసి షూటింగ్ ఉందని చెప్పాడు. అది స్వాతంత్య్ర సమరయోధుల మీద తీస్తున్నది. ఆ దర్శకుడు ఎవరో అప్పటికీ ఎవరికి తెలియదు. గుంపులో గోవిందాలాగా కనిపించాలని, 50రూపాయలు ఇస్తామని చెప్పారు. దాంతో నేను కూడా గుంపులో నిలబడ్డాను. కానీ మెయిన్ రోల్ కోసం తీసుకున్న వ్యక్తి సరిగా చేయకపోతుండటంతో నేను చేస్తాను అని చెప్పి చేసి చూపించాను. దాంతో ఆ దర్శకుడు బాగా చేశావు. పైకొస్తావు అన్నారు. ఆయనెవరో కాదు పూరీజగన్నాథ్. ఇక పూరీకి చెందిన సీరియల్ విషయానికి వస్తే నాకు కాస్ట్యూమర్ ఇచ్చిన పైజమా టైట్ అయింది. అన్నా కాస్త పెద్దది ఇస్తావా? అని కాస్ట్యూమర్‌ని అడిగాను. వేరేవి లేవు కేవలం ఇవే ఉన్నాయ్ అంటూ ఆయన రెక్లెస్‌గా సమాధానం చెప్పాడు. దాంతో విషయం పూరీకి చెప్పాను. పూరీ వచ్చి కాస్ట్యూమర్‌తో ఇందాక మరో ఆర్టిస్టు కోసం పైజమా అనుకున్నాం కదా.. అది ఇతనికి ఇవ్వు. సరిపోతుంది అని చెప్పాడు. ముందుగానే ఆ పని చేయకపోవడంతో పూరీ ఆ కాస్ట్యూమర్‌కి చీవాట్లు పెట్టాడు. కోపంతో కాస్ట్యూమర్ నా డ్రస్ మార్చాడు.
'ఇంత పెద్ద విషయం అవుతుందని అనుకోలేదన్నా.. ఏమి అనుకోవద్దు' అని ఆ కాస్ట్యూమర్‌కి చెప్పాను. ఆయన 'గుర్తుపెట్టుకుంటా.. బాగా గుర్తుపెట్టుకుంటా' అన్నాడు. దాంతో నాకు కూడా కోపం వచ్చింది. దాంతో నేను 'అన్నా.. నీకో విషయం తెలుసా? గుర్తుపెట్టుకోవడానికి నువ్వు అంత కష్టపడనవసరం లేదు. నేను ఏం చేసినా గుర్తుండిపోయేలా చేస్తాను అని నా శైలిలో కౌంటర్ ఇచ్చాను అని తెలిపాడు. ఇక 'ఇష్క్, మనం' చిత్రాలకు రచయితగా పనిచేసిన హర్షవర్ధన్ ప్రస్తుతం యాంకర్ శ్రీముఖి ప్రధానపాత్రలో 'గుడ్ బ్యాడ్ అగ్లీ' (గూగ్లీ) అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.