ఆంధ్రా సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు తమ్మారెడ్డి భరద్వాజ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను చంద్రబాబు నాయుడుకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం లేదని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు మాత్రమే శుభాకాంక్షలు చెబుతున్నానని తెలిపాడు. ఇక చాలా మంది చంద్రబాబుని నమ్మబోమని అంటున్నారు. వారికి ఇంగిత జ్ఞానం ఉండాలి. ఈరోజు చంద్రబాబు చేస్తున్న దీక్ష రాష్ట్రానికి మంచిదా? కాదా? అనేదే ఆలోచించాలని తెలిపాడు. రాష్ట్రం కోసం పోరాడుతున్న చంద్రబాబు తమ పోరాటాన్ని ఆపేస్తే రాష్ట్ర దోహిగా మిగులుతారు. ఆ మాత్రం మీరు అర్ధం చేసుకోలేరా? విమర్శలు చేసే వారికి ఇంగితం ఉండాలి. ప్రజలందరి కోసం ఒకరు పోరాడుతుంటే ఆయన గతంలో ఏదో చేశాడని ఆరోపిస్తూ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు.
మనల్ని బిజెపి మోసం చేసిందని అందరికీ తెలుసు. అయినా మన వారు వారితోనే కలుస్తుంటారు. వాళ్లు చెప్పేదే నమ్ముతారు. టిడిపి కోసమో, చంద్రబాబు కోసమో మనం పోరాడటం లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పోరాడుతున్నాం. చంద్రబాబు పోరాటానికి అందరు మద్దతు ఇవ్వాలి. ఒక్కోక్కరు ఒక్కో కుంపటి పెట్టుకుని, ఆ కుంపట్లో కూర్చుని ఏదేదో మాట్లాడుతూ పోతే రాష్ట్రానికి న్యాయం జరగదని తమ్మారెడ్డి అభిప్రాయ పడ్డారు. ఇక ఈయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉన్నా.. చంద్రబాబే ఒక నాడు ప్రత్యేకహోదా సంజీవని కాదని, ప్రత్యేక ప్యాకేజీ ముద్దని, పాచిపోయిన లడ్డులే తమకు కావాలని చెబూతూ, కేంద్రంలోని మంత్రులను కూడా కొనసాగిస్తూ, ఇప్పటి వరకు బిజెపి ప్రవేశపెట్టిన బడ్జెట్స్ ఏపీకి ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయని చెప్పిన మాట నిజం కాదా? ఇంతకాలం మౌనంగా ఉండి. కేంద్రంతో తగవు పడితే అసలుకే మోసం వస్తుందని మీన మేషాలు లెక్కించిన చంద్రబాబు చిత్తశుద్దిని మాత్రం ఎవ్వరూ నమ్మలేరు.
కాబట్టి కేవలం చంద్రబాబుకి మద్దతుగా తనంతట తానే మద్దతు తెలుపుతూ, తమ్మారెడ్డి చెబుతున్న మాటల్లో నిజం లేకపోయినా, మనం టిడిపి కోసమో, చంద్రబాబు కోసమే పోరాటం చేయడం లేదని, కేవలం రాష్ట్ర ప్రయోజనాలు కోసమే చేస్తున్నామని చెప్పడం మాత్రం వాస్తవం. రాష్ట్రం కోసం చంద్రబాబుకి మద్దతు ఇస్తే ఆయన దానిని తన స్వంత ఓటు బ్యాంకుకి వాడుకోరని నమ్మకం ఏమిటి? అన్నదే ప్రశ్న.