చిరంజీవి తనయునిగా దశాబ్దం కిందట తెరంగేట్రం చేసిన రామ్‌చరణ్ 'మగధీర'ని మించిన స్థాయిలో తనలోని నటనాప్రతిభను చూపించిన చిత్రంగా 'రంగస్థలం'ని చెప్పుకోవచ్చు. ఈ చిత్రంతో ఆయన పూర్తిగా మెగాస్టార్ నీడ నుంచి బయటికి వచ్చి తనదైన స్పెషాలిటీ ఏర్పరచుకున్నాడు. ఇక రామ్‌చరణ్ ఈ చిత్రంలో నటన ద్వారా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటూ ఉంటే 'ఖైదీనెంబర్ 150' కలెక్షన్లను కూడా దాటేసి 'బాహుబలి-ది బిగినింగ్, బాహుబలి-ది కన్‌క్లూజన్' తర్వాత నాన్ బాహుబలి రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇక ఈ చిత్రం ఇంతలా సక్సెస్ కావడానికి కారణం చెబుతూ, ఈ చిత్ర దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ.. ఏ సినిమా హిట్ కావడానికైనా కథ, కథనాలే కారణమవుతాయి. కథ, కథనాలు బాగా లేనప్పుడు ఇతర హంగులు ఎన్ని ఉన్నా ఉపయోగం ఉండదు. ఇదే కథను కొత్తవారితో చేస్తే రిజల్ట్ వేరేగా ఉండి ఉండేది. రామ్‌చరణ్ స్టార్ హీరోకాబట్టి ఈ సినిమా రేంజ్ ఈ స్థాయిలో ఉంది. కథ ఏమాత్రం బాగున్నా స్టార్ హీరోలు వాటిని జనాలలోకి బాగా తీసుకుని వెళ్తారు. స్టార్ హీరోలకు ఉండే ప్లస్ పాయింట్ అదే. కథ, కథనాలు, చరణ్ స్టార్ ఇమేజ్, ఆయన నటన సినిమాకి ప్లస్ పాయింట్స్‌గా నిలిచాయి. ఇక ఈ చిత్రంలో రామ్‌చరణ్ గిన్నెలు తోమడం చూపించారు. నిజంగా ఓస్టార్ హీరో అలాంటి సీన్‌లో నటించడానికి ఎంతో సాహసం కావాలి.
చరణ్ చేసినది మట్టి మనిషి పాత్ర. గొప్ప విషయం ఏమిటంటే, ఎంతో అనుభవం ఉన్నట్లు, రోజు ఇంట్లో గిన్నెలు తోముతున్నట్లు, వంట చేస్తున్నట్లు ఎంతో అనుభవం ఉన్నట్లు నేచురల్‌గా చేయడంతో మేము షాక్‌కి గురయ్యాం. ఈ సీన్ చూసి చిరంజీవిగారు నువ్వు చేసి చూపించినట్లు ఉన్నావు. అందుకే అంత నేచురల్‌గా చేశాడని అన్నారు. నిజంగానే నేను చేసి చూపించలేదు సార్. ఆయన అంతగా పాత్రలో లీనమయ్యాడు అంతే అని చెప్పారు. నేను ఎన్నిసార్లు చెప్పినా చిరంజీవి గారు మాత్రం నమ్మలేదు. కొన్నిసీన్స్‌లో రామ్‌చరణ్ నటన హావభావాలు నాకే షాక్‌కి గురిచేశాయి అని సుకుమార్ చెప్పుకొచ్చాడు.