గత కొంతకాలంగా ఇండస్ట్రీలో కాస్టింగ్‌కౌచ్ గురించి విపరీతమైన చర్చనడుస్తోంది. ఇక ఇది కేవలం టాలీవుడ్‌లోనే కాదు.. హాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్..ఇలా అన్నిచోట్లా ఉంది. ఇక ఈ విషయంతోపాటు షూటింగ్ పరిసరాలలో మహిళా ఆర్టిస్టులకు కనీసం బాత్రూంకి వెళ్లే సదుపాయాలు లేకపోవడం, కాస్టూమ్స్ మార్చుకునేందుకు కూడా షూటింగ్ జరిగే ప్రదేశాలలో నిర్మాతలు కనీస అవసరాలను ఏర్పాటు చేయకపోవడంపై రచ్చ జరుగుతోంది. హీరోలు, హీరోయిన్లు, ఇతర ప్రముఖ ఆర్టిస్టులకు మాత్రం క్యారవాన్‌లను సిద్దంగా ఉంచే నిర్మాతలు, మహిళల్లో చిన్నస్థాయినటీమణులు, జూనియర్ ఆర్టిస్టులలో ఉన్న మహిళలకుఇలాంటి కనీస సదుపాయాలు కూడా లేవని తెలుసుకుని పలువురు షాక్‌కి గురయ్యారు.
ఏదో దశాబ్దం కిందట, శ్రీదేవి, రాశి వంటి వారు ఉన్నప్పుడు వారు చెట్లు, పొదల మాటుకు వెళ్లి కాస్ట్యూమ్స్ మార్చుకునే వారు. కానీ నేటిరోజున కూడా అదే పరిస్థితి ఉందంటే దారుణమనే చెప్పాలి. మరోవైపు కాస్టింగ్‌కౌచ్ జరగకుండా తగిన వాతావరణం ఉండేలా చేయడం కూడా నిర్మాతల బాధ్యతే. మరోవైపు ఈ నటీమణులకు ఇచ్చే రెమ్యూనరేషన్‌లో వీరికి అవకాశం ఇప్పించి, పిలిపించిన కోఆర్డినేటర్ 75శాతం డబ్బును తాను తీసుకుని, కేవలం ఐదు వేలకి గాను ఏదో వెయి రూపాయలు వారి చేతిల్లో పెడుతున్నాడు. ఈ విషయంపై నాగబాబు జోక్యం చేసుకున్నాడు. ఈయన ఫిల్మ్‌చాంబర్ ప్రెసిడెంట్ కిరణ్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కె.ఎల్.నారాయణతో చర్చలు జరిపి ఈ మూడు సమస్యలపై వారినుంచి హామీ సాధించాడు.
కాస్టింగ్‌కౌచ్, షూటింగ్‌ప్రదేశాలలో మహిళా ఆర్టిస్టులకు టాయిలెట్ సౌకర్యాలు, పారితోషికాన్నికేవలం కోఆర్డినేటర్‌కి ఇవ్వకుండా మొత్తం అమౌంట్‌ని ఆయా ఆర్టిస్టుల చేతిలో అందేలా ఆయన హామీ పొందానని, దానికి సంబంధించిన ప్రకటన మరో వారం రోజుల్లో రానుందని, అలా రానిపక్షంలోవారితో మరోసారి సమావేశం అవుతానని నాగబాబు ప్రకటించాడు. అయితే వారిపై ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదని, వారుకూడా మనసున్న మనుషులని నాగబాబు తెలిపాడు. ఈ సౌకర్యాల కోసం డిమాండ్ చేసినా సాధారణ ఆర్టిస్టుల విజయం ఇదని, వారిని అభినందిస్తున్నానని నాగబాబు తెలిపాడు. మొత్తానికి దాసరి తర్వాత ఎవ్వరూ ఇండస్ట్రీని పట్టించుకోని పరిస్థితుల్లో ఈ విషయంలో జోక్యం చేసుకున్న నాగబాబుని మెచ్చుకుని తీరాల్సిందే.