శ్రీరెడ్డి.. పవన్ తల్లి విషయంలో మాట్లాడిన మాటలకు తాను షాక్ అయ్యానని, ఇంకా కోలుకోలేకపోతున్నానని, ఇప్పటికీ అవే మాటలు, అవే స్క్రీన్‌పై మసక మసకగా కనిపిస్తూ ఆవేదనకు గురిచేస్తున్నాయని తెలుగు హీరో, నటుడు కృష్ణుడు అభిప్రాయపడ్డాడు. స్త్రీల విషయాలలో ఉద్యమించే మహిళాసంఘాలు పవన్ తల్లి కూడా ఓ మహిళే అన్న విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? అలా చేస్తే మీ ఉద్యమాలకు ఉన్న విలువ ఏంటి? కడుపు రగులుతోంది.. గుండె మండుతోంది. ఆ మాటలు విన్న తర్వాత ఏమి మాట్లాడాలో తెలియని పరిస్థితి. సినిమాలు, ఆడియో ఫంక్షన్స్, షార్ట్‌ఫిల్మ్.. ఇలా ప్రతి విషయంలోనూ పవన్ క్రేజ్‌ని వాడుకున్న వారంతా స్పందించాలి. పెద్ద పెద్ద డైరెక్టర్లు, నిర్మాతలు కూడా స్పందించాలి. లేకపోతే ఇప్పుడు పవన్‌కి జరిగిందే రేపు మీకు కూడా జరుగుతుంది. ఇక ఎన్టీఆర్, ప్రభాస్,ఇలా అందరి స్టార్స్ అభిమానులు కూడా స్పందించాలి.
ఎందుకంటే నేడు పవన్ మీద చేసినట్లే రేపు మీ హీరో మీద కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేస్తారు. ఇప్పుడు పవన్ తల్లిని అన్నవారు రేపు మీ అక్కలని, అమ్మలని, చెల్లెళ్లకు, కూతుర్లను కూడా అనకుండా ఉండరు. మా ఇండస్ట్రీ అంతా ఒక ఫ్యామిలీ. మేమందరం కళామతల్లి ముద్దుబిడ్డలం అని చెప్పుకునే అందరు స్పందించాలి. గళం విప్పండి. సహనంగా ఉండే పరిస్థితి చేయి దాటి పోయింది. సమయం మించి పోయింది. ఓపికగా ఉండే హద్దులు పగిలిపోయాయి. ఇక అడుగేయండి.. ఒకేఒక్క అడుగు. ప్రేక్షకులు, ప్రజలు కూడా స్పందించండి. ఆదివారమో, నెలకి ఒకసారే ఫ్యామిలీతో సహా థియేటర్‌కి వెళ్లితే మిమ్మల్ని నవ్వించి, ఎంటర్‌టైన్ చేసేది సినిమా వాడు కదా..! కాబట్టి ప్రజలు, ప్రేక్షకులు కూడా స్పందించండి. ఇప్పుడు నాకు భాస్కరభట్ల మాటలు గుర్తుకొస్తున్నాయి. 'సరదాగా మీరంతా మా సినిమా చూస్తారండి....అయినా మేమంటే ఓ చిన్నచూపులెండి' అనే వాక్యాన్ని కృష్ణుడు పోస్ట్ చేశాడు.