రాంగోపాల్‌వర్మని గురువుగా భావించే దర్శకులే కాదు.. ఆయన యాటిట్యూడ్‌ని ఫాలో అయ్యేవారు.. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని వివాదాల ద్వారా సెలబ్రిటీలు కావాలనుకునే శిష్యుల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. ఇక వర్మలో ఉన్న గొప్పతనం ఏమిటంటే.. ఆయనేమీ దాచుకోడు. తాను చేసింది ఎంత పెద్ద తప్పైనా, ఒప్పైనా ఒప్పేసుకుంటాడు. ఇటీవల వర్మ మాట్లాడుతూ, కోఆర్డినేటర్లందరు బ్రోకర్లేనని, తనతో పాటు దర్శకులందరికి కో ఆర్డినేటర్స్ 50 ఫోటోలు పంపితే. అందులో కాంప్రమైజ్ అయ్యేవారి లిస్ట్‌ని ప్రతి దర్శకునికి పంపుతారని చెప్పాడు. ఇక ఈయన శ్రీరెడ్డిని ఝాన్సీలక్ష్మీభాయ్, అశోక చక్రవర్తితో పోల్చాడు. ఇంతవరకు ఆయన ప్లాన్ బాగానే వర్కౌట్ అయింది. కానీ అసలు ఈ ఇష్యూతో సంబంధంలేని, కేవలం కోర్టుకి, పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి చట్టప్రకారం చర్యలు తీసుకోమని శ్రీరెడ్డికి సంబంధించిన పవన్ వ్యాఖ్యలకు శ్రీరెడ్డి ప్రతిస్పందన మాత్రం దారుణంగా ఉంది. ఓ మహిళ అయి ఉండి పవన్ తల్లిని అలా వ్యక్తిగతంలో బూతులతో దూషించడం పట్ల శ్రీరెడ్డి మద్దతు దారుల్లో కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
ఇక తాజాగా వర్మ మాట్లాడుతూ, కాస్టింగ్‌కౌచ్ విషయానికి వస్తే 'శ్రీరెడ్డికి ముందు-శ్రీరెడ్డి తర్వాత' అని విభజించుకోవాల్సి వస్తుందని తెలిపాడు. బహుశా ఆయన తీసిన 'శివ'కి ముందు, తర్వాత అన్నట్లుగా అన్నమాట. ఈ విధంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ 'శ్రీరెడ్డికి ముందు.. తర్వాత'గా విడిపోతుందని, శ్రీ సునామీ సృష్టించిదని వరుస ట్వీట్స్ చేశాడు. తిరుగుబాటుకి సంబంధించిన ఏ చర్య అయినా ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని, ఏ పరిస్థితుల రీత్యా వారు తిరుగుబాటు చేశారనే అంశాన్ని ఓ వ్యక్తిగా అర్ధం చేసుకోవడానికి బదులు, నెగెటివ్‌గా రియాక్ట్ అవుతారని, చెగువేరా చెప్పిన సత్యం ఇదేనంటూ పవన్‌కళ్యాణ్, శ్రీరెడ్డిలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాడు. ఇక ఈయన మాట్లాడుతూ, క్యాస్టింగ్‌కౌచ్‌పై శ్రీరెడ్డి చేస్తున్న పోరాటంలోకి పవన్‌ని లాగమని నేనే శ్రీరెడ్డికి సలహా ఇచ్చానని వర్మ ఒప్పుకున్నాడు. పవన్‌ని లాగడం వల్ల ఈ ఉద్యమం ప్రజల్లోకి తొందరగా వెళ్తుందనే ఉద్దేశ్యంతోనే తాను ఆ సలహా ఇచ్చానన్నాడు.
ఈ విషయంలో పూర్తి బాధ్యత తనదేనని తెలిపాడు. కేసీఆర్, పవన్‌లు చాలా సార్లు విమర్శించుకున్నారని, ఆ తర్వాత ఇద్దరు కలసి భోజనం చేశారని వర్మ గుర్తుచేశాడు. రాజకీయ నేతలు చేసే పనినే నేను చేశాను. పవన్‌ని విమర్శించడం ద్వారా కత్తి మహేష్ పాపులర్ అయిన విషయాన్ని శ్రీరెడ్డికి తాను చెప్పానని వర్మ అంగీకరించాడు. తాను చెప్పినట్లే ఉద్యమం అన్ని వైపుల నుంచి ప్రజల్లోకి వెళ్లిందని, ఈ విషయంలోకి పవన్‌ని లాగినందుకు పవన్‌కు, ఆయన ఫ్యాన్స్‌కి సారీ చెబుతున్నానని, ఈ మేరకు ఓ వీడియోను ఆయన పోస్ట్ చేశాడు.