ఒకవైపు సినీ పెద్దలే పైరసీ పైరసీ అని బాధపడుతున్నారు. ఓ సినిమా రిలీజైన రోజే ఇంటర్‌నెట్‌లో లింక్‌లు వస్తున్నాయి. ఇక సీడీలు కూడా వీకెండ్ లోపలే తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ప్రేక్షకులు, సినిమా వారిలో మార్పు రానిదే దీనికి అడ్డుకట్ట వేయడం కష్టమనే చెప్పాలి. ఇక తాజాగా నాని ద్విపాత్రాభినయంతో వచ్చిన చిత్రం 'కృష్ణార్జున యుద్దం'. ఇటీవల నిర్మాతగా బాగానే ఆకట్టుకుంటున్న దిల్‌రాజు.. డిస్ట్రిబ్యూటర్‌గా మాత్రం నష్టాలను కొని తెచ్చుకుంటున్నాడు. 'స్పైడర్, అజ్ఞాతవాసి'లతో ఆయనకు పెద్ద షాకే తగిలింది. ఈ రెండింటి వల్ల ఆయనకు కోట్లలో నష్టం వచ్చింది. ఇక ఈయన నాని నటించిన 'కృష్ణార్జునయుద్దం'ని కూడా డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఇది కూడా నష్టాలు ఖాయమని తేల్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన 'రంగస్థలం' కి చాన్స్ వచ్చినా ధైర్యం చేయలేకపోయాడు. అది మాత్రం లాభాల పంట పడిస్తూ దిల్‌రాజుని డెసిషన్ రాంగ్ అని తేల్చేసింది. ఇక ఆయన మే11న విడుదల కానున్న పూరీజగన్నాథ్ 'మెహబూబా' పైనే దృష్టిపెట్టాడు.
ఇక కృష్ణార్జునయుద్దం రిజల్ట్ సంగతి పక్కనపెడితే ఈ చిత్రం పైరసీ సీడీ రెండు రోజుల్లో మార్కెట్‌లోకి రావడంతో పాటు ఏకంగా తెలంగాణ ప్రభుత్వానికి చెందిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 'టిఎస్ ఆర్‌టిసి'లోని గరుడప్లస్ బస్సులో దీని పైరెటెడ్ సీడీని వేశారట. దీంతో బెంగుళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న సునీల్ అనే వ్యక్తి ఈ చిత్రాన్ని టీఎస్ ఆర్‌టిసిలో ప్రదర్శిస్తున్న స్క్రీన్‌షాట్‌ని ఫోటో తీసీ కేటీఆర్‌కి ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశాడు. ప్రభుత్వ సంస్థలే పైరసీని ప్రోత్సహిస్తుంటే ఇక పైరసీకి అడ్డుకట్ట ఎలా పడుతుంది? అని సునీల్ ప్రశ్నించాడు.
దీనిపై స్పందించిన కేటీఆర్ టిఎస్ ఆర్‌టీసీ ఉద్యోగుల బాధ్యతారహిత్యం ఇదని తెలిపాడు. వెంటనే ఆయన టిఎస్ ఆర్‌టిసి ఎండీ రమణారావుని తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో ఆయన కూడా ఉద్యోగులను వివరణ కోరారు. ఆర్టీసీ గరుడ, గరుడ ప్లస్, సూపర్‌లగ్జరీ బస్సుల్లో సినిమాలను ప్రదర్శించే పనిని ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించామని, ఇక ఇందులో మాస్టర్ ప్రింట్లు తప్ప పైరసీ సినిమాలను ప్రదర్శించకూడదనే నిబంధన కూడా ఉందని తెలపడంతో పాటు ఆ ప్రైవేట్ సంస్థపై చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు.