'పోకిరి' చిత్రంతో 'ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే' అని రచ్చ రచ్చ చేసింది ముమైత్‌ఖాన్. ఆ తర్వాత వరుసగా పెద్ద చిత్రాలన్నింటిలో ఈమె ఐటంసాంగ్ కంపల్సరీగా మారింది. ఇక ఈమె లీడ్ క్యారెక్టర్లలో కొన్ని చిత్రాలు కూడా రూపొందాయి. ఇక 2016లో వచ్చిన 'తిక్క' చిత్రం తర్వాత ఈమె మరలా వెండితెరపై కనిపించలేదు. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఇరుక్కుని, అదే సమయంలో బిగ్‌బాస్ సీజన్1లో ఈమె నానా హడావుడి చేసింది. కాగా ఈమె తాజాగా తనకి చెందిన రెండు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. రెండేళ్ల కిందట అంటూ ఓ లావుగా ఉన్న ఫొటోతో పాటు 'రెండేళ్ల తర్వాత' అంటూ తాజా ఫొటోని ఆమె సోషల్ మీడియాలో పెట్టింది.
ఈ సందర్భంగా ఆమె షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చింది. నాకు రెండేళ్ల కిందట మూర్చ వ్యాధి వచ్చింది. దాని కోసం డాక్టర్ల పర్యవేక్షణలో మందులు వేసుకుంటున్నాను. డాక్టర్లు రెండేళ్ల పాటు ఎలాంటి బరువులు ఎత్తవద్దని చెప్పారు. దాంతో వ్యాయామం లేక నేను బాగా బరువు పెరిగాను. కానీ నేనేమీ దిగులు చెందలేదు. ఎందుకంటే సన్నబడటం ఎంతో ఈజీనో నాకు బాగా తెలుసు. ఫిట్ మీల్స్ ఇండియా వారు సూచించినట్లు కార్బొహైడ్రేట్లు తక్కువగా, పోషకాలు ఎక్కువగా ఉండే మంచి ఆహారం తీసుకున్నాను. మంచి ఆహారం, రోజుకి సరిపడిన మంచి నీరు, రోజూ ఖచ్చితంగా 8గంటల పాటు మంచి నిద్ర వచ్చేలా చూసుకుంటే ఎలాంటి రోగాలు, ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు తలెత్తవు. అలా నేను చేసి మరలా బరువు తగ్గాను అని చెప్పుకొచ్చింది. అందరు మంచి పోషకాహారం తీసుకుని, తగినన్ని మంచినీరు, 8గంటల నిద్ర పోవాలని ఆమె సూచించింది.
ఇక తాను ఈ కాలంలో ఎదుటివారు నీనుంచి ఏది ఆశిస్తున్నారో...అది మాత్రం పట్టించుకోకూడదనే విషయాన్ని తెలుసుకున్నానంటూ జీవిత సూక్తులు చెప్పింది. నిజంగానే ముమైత్‌ఖాన్ తన చిన్ననాటి పేదరికం, ఇప్పుడు ఇలా ఆరోగ్య సమస్యలు, మధ్యలో డ్రగ్స్ వంటి ఆరోపణల వల్ల జీవిత సారాన్ని బాగానే అర్ధం చేసుకుందని చెప్పవచ్చు.